పోటీ తప్పదు!
పోటీ తప్పదు!
Published Wed, Apr 19 2017 11:07 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
సీఎంకు తేల్చి చెప్పిన శిల్పామోహన్‌రెడ్డి
– కేడర్ అభిప్రాయాన్ని బట్టి నడుచుకుంటానని స్పష్టీకరణ
– టీడీపీలోనే కొనసాగాలని తమ్ముడు చక్రపాణిరెడ్డి ఒత్తిళ్లు
– నా రాజకీయ జీవితం నాశనం చేయవద్దని మండిపాటు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో తాను పోటీ తప్పక చేస్తానని మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తన వెనకున్న కేడర్ అభిప్రాయాన్ని బట్టే తాను నడుచుకుంటానని తేల్చిచెప్పారు. సీఎంతో విజయవాడలో గంట పాటు జరిగిన చర్చల సందర్భంగా ఇదే విషయాన్ని సీఎంకు తేల్చి చెప్పినట్లు శిల్పామోహన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. భూమా కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో నంద్యాల అసెంబ్లీ టిక్కెట్టు తనకు వదిలేయాలని సీఎం వద్ద ఆయన ప్రతిపాదించారు. అయితే భూమా నాగిరెడ్డి మరణించడంతో జరుగుతున్న ఉప ఎన్నికలు కాబట్టి వారి కుటుంబానికే సీటు ఇవ్వాలని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది.
ఇదే జరిగితే తాను తప్పకుండా ఇతర పార్టీ నుంచో, స్వతంత్రంగానో పోటీలో ఉంటానని ఆయన కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. మరోవైపు టీడీపీలోనే కొనసాగాలని తమ్ముడు చక్రపాణిరెడ్డి కోరినట్లు తెలిసింది. తన రాజకీయ జీవితం నాశనం చేయవద్దని అన్నపై ఆయన మండిపడినట్లు సమాచారం. అయితే తన వెనుక ఉన్న కేడర్ అభిప్రాయానికి భిన్నంగా నడుచుకునే అవకాశం లేదని శిల్పామోహన్‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది.
గత రెండు రోజులుగా...
వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌పై భూమా కుటుంబం పోటీలో ఉంటుందని అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాలలో తిరుగుతున్నాడు. కేడర్‌తో సమావేశమవుతున్నారు. దీంతో పార్టీ మారి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని శిల్పామోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తనకు అత్యంత ఆప్తులుగా ఉన్న కొద్ది మంది నేతలకు కూడా స్పష్టం చేశారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని అధికార పార్టీకి తెలిసిపోయింది. ఈ పరిస్థితుల్లో శాసనమండలి చైర్మన్ పదవి రేసులో ఉన్న తమ్ముడు చక్రపాణిరెడ్డి రంగంలోకి దిగారు.
తన రాజకీయ జీవితం నాశనం చేయవద్దని.. అధికార పార్టీలో కొనసాగాలని అన్నపై ఒత్తిళ్లు తెచ్చినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం ఇరువురి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు సమాచారం. తమ్ముడు ఒత్తిడితో మంగళవారం మంత్రి అచ్చెన్నాయుడుతో శిల్పామోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. అదేవిధంగా బుధవారం కూడా నేరుగా ముఖ్యమంత్రితో టిక్కెట్ విషయంపై చర్చించారు. అయితే కేడర్ నిర్ణయానికి భిన్నంగా పోలేనని, ఉప ఎన్నికల్లో స్వతంత్రంగానైనా బరిలో ఉంటానని శిల్పామోహన్‌రెడ్డి తేల్చిచెప్పినట్లు తెలిసింది. వాస్తవానికి బుధవారం ఆయన కార్యకర్తలతో సమావేశం కావాల్సి ఉంది. సీఎంతో భేటీ సందర్భంగా ఈ సమావేశం వాయిదా పడింది.
అఖిల మంత్రాంగం
నంద్యాల టిక్కెట్ విషయంపై శిల్పామోహన్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారనే సమాచారంతో మంత్రి అఖిలప్రియ మంత్రాంగం మొదలుపెట్టారు. శిల్పా సోదరుల కంటే ముందుగానే సీఎంతో భేటీ అయ్యారు. తన తండ్రి మరణించడంతో జరుగుతున్న ఉప ఎన్నికలు కాబట్టి తమ కుటుంబానికే టిక్కెట్ ఇవ్వాలని మరోసారి కోరారు. ఈనెల 24న శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా తమ కుటుంబ అభ్యర్థిని ప్రకటిస్తామని సీఎంకు తేల్చిచెప్పారు. దీనికి సీఎం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
మరోవైపు శిల్పామోహన్‌రెడ్డిని బుజ్జగించేందుకు సీఎం శతవిధాలా ప్రయత్నించారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌తో పాటు మోహన్‌రెడ్డి కుమారునికి ఎంపీ టిక్కెట్ కూడా ఆఫర్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతే కాకుండా మంత్రి పదవిని కూడా ఇస్తామని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. అయితే భూమానాగిరెడ్డి మంత్రి పదవి ఉదంతం నేపథ్యంలో సీఎం మాటలను నమ్మేందుకు మోహన్‌రెడ్డి సుముఖంగా లేరని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మొత్తం మీద మరో నాలుగు రోజుల్లో నంద్యాల ఉప ఎన్నికల రాజకీయం విషయంలో అధికార పార్టీ వ్యవహారం తేటతెల్లం కానుంది.
Advertisement