డిజిటల్.. డీలా
♦ అలంకార ప్రాయంగా కంప్యూటర్లు
♦ 80 గ్రామపంచాయతీల్లో నిరుపయోగం
♦ పల్లె ప్రజలకు అందని సేవలు
గ్రామీణ ప్రాంత ప్రజలకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామపంచాయతీలకు కంప్యూటర్లు మంజూరు చేసింది. ఆపరేటర్లు లేకపోవడం.. కొన్ని పంచాయతీల భవనాలు శిథిలావస్థకు చేరడం.. అధికారుల పర్యవేక్షణ లోపం.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి.
నర్సంపేట : జిల్లాలో 15 మండలాల పరిధి 160 క్లస్టర్ల కింద 269 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు ఉన్నాయి. కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వం 185 గ్రామ పంచాయతీలకు కంప్యూటర్‌లు మంజూరు చేసింది. రెండో విడతలో 80 గ్రామ పంచాయతీలకు అందజేసిన కంప్యూటర్లకు ఇంటర్నెట్ సౌకర్యం, ఆపరేటర్లు లేకపోవడంతో పాటు భవనాలు శిథిలావస్థలో ఉండడం వల్ల కంప్యూటర్లు పనిచేయడంలేదని జిల్లా అధికారులు వెల్లడించారు. కొన్ని మండలాల్లో సరైన భవనాలు లేక కంప్యూటర్లను ఇతరచోట్ల దాచిపెడుతున్నా రు. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలకు డిజిటల్ సేవలు కలగానే మిగులుతున్నాయి.
పలు సేవలకు దోహదం
డిజిటల్ వ్యవస్థలో ప్రజలకు సత్వర సేవలు అందించాల్సి ఉంటుంది. ఇంటి పన్నుల వసూళ్లు, ఖర్చుల వివరాలు, సిబ్బంది జీతభత్యాలు, జనన, మరణ వివరాలు, భవన నిర్మాణాల అనుమతులు, ఇళ్ల నిర్మాణాలు, భూములకు మంజూరి అనుమతుల వివరాలు, ధ్రువీకరణ పత్రాలు, ఫిర్యాదు, గ్రామ భౌగోళిక వివరాలు, తాగునీటి వసతుల వంటి వాటిని పూర్తి స్థాయిలో కంప్యూటర్‌లో పొందుపర్చాలి. వీటితో పాటు పంచాయతీలో ఉన్న వనరులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, తాగునీటి వసతులు, చెరువులు, ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, ఉద్యోగుల వివరాలు, తదితర విషయాలను పక్కాగా నమోదు చేస్తారు. పూర్తిస్థాయిలో కంప్యూటర్‌లను వినియోగిస్తే అన్ని ఆన్‌లైన్ ద్వారానే పొందేందుకు వీలవుతుంది. పాలనలో పారదర్శకత పెరుగుతుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందజేసే అవకాశం ఉంటుంది.
కనీస వసతులు కల్పించాలి
పంచాయతీల్లో కంప్యూటర్‌లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ముదస్తుగా కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. పక్కా భవనాలు ఉన్న పంచాయతీల్లో సత్వరమే ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించి కంప్యూటర్ ఆపరేటర్లను నియిమించాలి. భవనాలు లేని పంచాయతీల్లో తాత్కాలిక భవనాల్లోనైనా ఏర్పాట్లు చేసి కంప్యూటర్‌లను వినియోగింలోకి తేవాలి. ఇలా చేస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.
ఎలాంటి ఆదేశాలు లేవు
గ్రామ పంచాయతీలో డిజిటల్ సేవల కోసం ఏడాది క్రితం కంప్యూటర్ అందించారు. కంప్యూటర్ నిర్వహణ కోసం ప్రత్యేక ఆపరేటర్‌ను నియమించుకోవడానికి, పంచాయతీ కార్యదర్శే ఆపరేట్ చేయాలనే ఆదేశాలు లేవు. గ్రామ పంచాయతీలో కంప్యూటర్‌కు భద్రత ఉండదనే మా ఇంట్లోనే దాచాను. ఇప్పటికైనా ప్రభుత్వం కంప్యూటర్ నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
– అనంతుల రేవతి, శనిగరం సర్పంచ్