
ఆగని మద్యం సెగలు
⇒ ఇళ్ల మధ్య దుకాణాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు
⇒ఎక్సైజ్ శాఖకు 30కి పైగా అభ్యంతరాలు
⇒ ప్రజాందోళనలతో తెరచుకోని 35 శాతం మద్యం షాపులు
నెల్లూరు : జిల్లాలో మద్యం దుకాణాలపై రణరంగం కొనసాగుతూనే ఉంది. ఇళ్ల మధ్యన.. గుడి, బడిలకు సమీపంలో దుకా ణాలు పెట్టొద్దంటూ సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్నాయి. నెల్లూరు నగరంతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసనల పర్వం కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలో మహిళలు రోడ్డెక్కి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రజా ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ముఖ్యనేతలు మద్దతు పలికి ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో షాపుల్ని వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి ఎక్సైజ్ అధికారులకు వినతులు అందాయి. ఈ పరిణామాల క్రమంలో జిల్లాలో మద్యం వ్యాపారం మందగించింది.
20 రోజులుగా నిరసనలే
మద్యం దుకాణాల ఏర్పాటును నిరసిస్తూ జిల్లాలో 20 రోజులుగా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని ఇళ్ల మధ్య దుకాణం ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు. అక్కడి దుకాణాన్ని తొలగించే వరకు పరిస్థితిని సమీ క్షించారు. నెల్లూరు రూరల్‌లో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ధర్నాలు జరగ్గా.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాల్గొని, ముందుండి ఉద్యమం నడిపించారు. ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసి షాపులు మార్చే వరకు పరిస్థితిని సమీక్షించారు. కావలిలోని టీచర్స్ కాలనీలో మహిళల ఆందోళనకు అక్కడి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మద్దతు పలికి ధర్నా నిర్వహించారు.
షాపును మార్చేవరకు విశ్రమించలేదు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకటాచలం మండలం గూడ్లూరువారి పాళెంలో షాపు వద్దంటూ స్థానికులు ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మె ల్యే అధికారులతో మాట్లాడారు. తోటపల్లి గూడూరు, ఆత్మకూరు రూరల్‌లోని బజార్ వీధి, నెల్లూరు నగరంలోని తల్ప గిరి కాలనీ సెంటర్, కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం శివాలయం, ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి, గూడూరు మండలంలోని ఎస్సీ కాలనీ, సోమశిల, ఆత్మకూరు పట్టణంలో షాపుల ఏర్పాటును నిరసిస్తూ ఆందోళనలు కొనసాగాయి. నెల్లూరులోని శెట్టిగుంట రోడ్డులోని షాపు వద్ద మహిళలు నిరసన తెలిపి బోర్డుల్ని ధ్వంసం చేశారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు పెద్దసంఖ్యలో వినతిపత్రాలు అందటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.