అల్గునూర్‌లో కాంగ్రెస్ నాయకుల అరెస్టు
-
మల్లన్నసాగర్‌కు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
-
పోలీసులపై ఆగ్రహం
-
రాస్తారోకో చేసిన కాంగ్రెస్ నాయకులు
తిమ్మాపూర్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న జిల్లా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అల్గునూర్‌లో మంగళవారం అరెస్టు చేశారు. కరీంనగర్ డీఎస్పీ రామారావు, తిమ్మాపూర్, వన్ టౌన్ సీఐలు వెంకటరమణ, విజయసారథితోపాటు పలువురు సీఐలు, ఎస్సైలు, పోలీసు బలగాలతో అల్గునూర్ చౌరస్తాలో మంగళవారం ఉదయమే మొహరించారు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ నాయకులు మల్లన్నసాగర్‌కు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు అల్గునూర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. తరువాత జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం ఒకే వాహనంలో అల్గునూర్‌కు చేరుకోగా..వారిని డీఎస్పీ రామారావు, పోలీసులు అడ్డుకున్నారు. అద్దాలు దించాలని కోరినా.. వారు అలాగే కూర్చున్నారు. తర్వాత అద్దాలు దించి మాట్లాడుతుండగానే పోలీసులు వారి వాహనతాళంచెవిని లాక్కున్నారు. జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులపై లాఠీచార్జి చేయించిన ప్రభుత్వానిది తప్పు కాదా.. పరామర్శించేందుకు వెళ్తున్న తమదే తప్పా.. అంటూ మండిపడ్డారు. వాహనం నుంచి నాయకులను బయటకులాగి పోలీసులు తమ వాహనాల్లో బలవంతంగా ఎక్కించుకున్నారు. వారిని మానకొండూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అల్గునూర్ చౌరస్తాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనగా.. గంటకుపైగా నాయకులు అరెస్టు హైడ్రామా కొనసాగింది. రాస్తారోకోలో సీఎం డౌన్‌డౌన్ అంటూ, పోలీసుల జులుం నశించాలంటూ, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను అరికట్టాలని కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. రాస్తారోకో సమయంలో అల్గునూర్ చౌరస్తాకు మూడు దిక్కులా వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేతలను అరెస్టు చేసి తీసుకెళ్లిన తరువాత వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
బెజ్జంకి చెక్‌పోస్టులో అరెస్ట్
బెజ్జంకి: పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను పరామర్శించాడనికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకులను బెజ్జంకి చెక్‌పోస్టులో సీఐలు వెంకటరమణ, నారాయణ అరెస్టు చేశారు. అనంతరం వారిని వాహనాల్లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.