హైదరాబాద్: స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. వారి జాబితాను ఇప్పటికే తమ అధిష్టానానికి పంపించింది. అయితే, ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయంలో బాధ్యతను రాష్ట్ర పార్టీకే అప్పగించినట్లు అభ్యర్థుల ఎంపికను బట్టి తెలుస్తోంది. ఎవరిని ఎంపిక చేసినా పర్వాలేదని, పోటీ మాత్రం గట్టిగా ఉండాలని చెప్పడంతో మాజీ ఎంపీలను రంగంలోకి దించాల్సిందేనని నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ ఆ మేరకే అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీ అధిష్టానానికి పంపించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్
మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాజీ జెడ్పీ చైర్మన్ దామోదర్ రెడ్డి
నిజామాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ వెంకట రమణారెడ్డి
ఆదిలాబాద్ నుంచి మహేశ్వర్ రెడ్డి
నల్లగొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డిని ఎంపిక చేశారు. వీరు దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం కూడా ఈ రాత్రిలోగా ఆమోదం తెలపనుంది. వీరికి రేపు బీఫాంలు టీపీసీసీ అందించనుంది. మొత్తం పన్నెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 8 స్దానాల నుంచి పోటీ చేయనుంది. రెండేసి స్థానాలు ఉన్నచోటు నుంచి ఒక్క అభ్యర్థినే దించుతున్నారు. ఖమ్మంలో సీపీఐకి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా నల్లగొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండలో ఎమ్మెల్సీ సీటును గెలుచుకునేంతగా స్థానిక ప్రతినిధుల బలం కాంగ్రెస్ కు ఉందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు వామపక్షాలు కూడా మద్దతిచ్చాయని తెలిపారు. పోటీ చేయకుంటే టీడీపీ, బీజేపీకి ఉన్న స్థానిక ప్రతినిధులు కూడా కాంగ్రెస్ కు మద్దతిస్తారని చెప్పారు.