
దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతున్న భట్టి విక్రమార్క
- జిల్లాల పుర్విభజనపై మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క
మధిర : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జిల్లాల పునర్విభజనపై కాంగ్రెస్ అధికారంలోకివస్తే పునః సమీక్షించి అవసరమైతే మార్పులు, చేర్పులు చేయడానికి కూడా వెనుకాడబోమని మధిర ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిరను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ ఆమరణ దీక్ష చేస్తున్న వారికి శనివారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గైడ్‌లైన్స్ లేకుండా, కొత్త చట్టాలు చేసి జిల్లాల పునర్విభజన చేయాల్సిఉందని, సమయం లేదనంటూ 1974 జిల్లాల ఏర్పాటు చట్టం ప్రకారమే విభజన చేస్తామని చెప్పి అందుకు విరుద్దంగా జిల్లాల ఏర్పాటు జరిగిందని ఆయన విమర్శించారు. జిల్లాల పునర్విభజన ఏర్పాటు అతిశయోక్తిగా ఉందని భట్టి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాను మూడు లేదా నాలుగు జిల్లాలుగా విభజించి ఎక్కువ జనాభా ఉన్న హైదరాబాద్‌ను ఒకే జిల్లాగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. ప్రజాభిష్టం, ప్రజాస్వామ్యబద్దంగా జిల్లాల పునర్విభజన జరగలేదన్నారు. జిల్లాలను విభజించాలంటే ప్రజాస్వామ్య బద్దంగా గైడ్‌లెన్స్ ఏర్పాటుచేసి విభజిస్తే బాగుంటుందన్నారు. అఖిలపక్ష సమావేశంలో జిల్లాల పునర్విభజనతోపాటు రెవెన్యూ డివిజన్లపై ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ వాణిని వినిపిస్తామన్నారు. కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, సీపీఐ నాయకులు మందడపు నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు రంగా హన్మంతరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మిరియాల రమణగుప్త, దుంపా వెంకటేశ్వరరెడ్డి, బత్తుల శ్రీనివాసరావు, దారా బాలరాజు, తలుపుల వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు మాదల రామారావు తదితరులు పాల్గొన్నారు.