- జిల్లాలో 672 పోస్టులు ఖాళీ
- 289 ఉద్యోగాలు మాత్రమే భర్తీ
- ఈనెల 22న నోటిఫికేషన్ జారీ
- వచ్చే నెల 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!
Published Mon, Jul 25 2016 11:21 PM | Last Updated on Tue, Mar 19 2019 9:03 PM
నెల్లూరు(క్రైమ్): జిల్లా పోలీసు శాఖలో మూడేళ్లుగా సిబ్బంది కొరత వేధిస్తోంది. సివిల్ విభాగంలో 565, ఏఆర్ విభాగంలో 107కానిస్టేబుల్ పోస్టులు (మొత్తంగా 672) ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్నవారిపైనే పనిభారం పెరిగి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే పూర్తిస్థాయిలో ఖాళీలు భర్తీ అవుతాయని పనిభారం తగ్గుతుందని ఓ వైపు సిబ్బంది, నోటిఫికేషన్ విడుదల ద్వారా ఉద్యోగం దక్కుతుందని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూశారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్‌లో 9 బ్యాక్‌లాగ్ పోస్టులతో పాటు సివిల్‌విభాగంలో 246, ఏఆర్ విభాగంలో కేవలం 43 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడంతో వారి ఆశలపై నీళ్లుచల్లినట్లైంది. ఇది ఇలా ఉంటే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించేందుకు నిరుద్యోగులు భారీస్థాయిలో పోటీ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎంపిక ఇలా...
గత నోటిఫికేషన్లకు భిన్నంగా నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థి తొలుత 5 కిలోమీటర్ల పరుగుపందెంలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఇతర పరీక్షలకు అర్హుడు. అయితే తాజా నోటిఫికేషన్‌లో ఐదు కిలోమీటర్ల పరుగు పందెం రద్దుచేయడం నిరుద్యోగులకు కాస్త ఉపశమనం కల్పించారు. అదే క్రమంలో తొలుత ప్రిలిమనరీ పేరిట రాతపరీక్ష నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో అర్హత సాధించిన వారికి చిట్టచివరగా రాత పరీక్ష నిర్వహించి మెరిట్, రిజర్వేషన్ అధారంగా పోస్టులు భర్తీచేయనున్నారు.
3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ:
ఆగష్టు 3వ తేదీ ఉదయం 10 నుంచి సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు అభ్యర్థులు డబ్లూడబ్ల్యూడబ్ల్యూ.రిక్రూట్‌మెంట్.ఎపిపోలీస్.జీవోవి.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తుచేసుకోవాలి. దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 16 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రిలిమనరీ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు 10 రోజుల ముందుగానే వెబ్‌సైట్లో హాల్‌టిక్కెట్లు అందుబాటులో ఉంచుతారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్ష, పరుగుపందెం, లాంగ్‌జంప్ తదితరాలను నిర్వహిస్తారు. 2016 జూలై ఒకటికి ఇంటర్ ఉత్తీర్ణులైన ఓబీసీలు, పదోతరగతి ఉత్తీర్ణులై ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
Advertisement
Advertisement