‘తప్పులు చేశా.. చావే పరిష్కారం’
గోదావరిలో దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య
చెడు వ్యసనాలు, కుటుంబ కలహాలే కారణం !
రాజమహేంద్రవరం క్రైం : తప్పులు చేశాను..నాకు చావు ఒక్కటే పరిష్కారం అంటూ మరణ వాగ్మూలంలో పేర్కొని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం, లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న జొన్నాడ వెంకట్రావు (38) మండపేట రూరల్, ద్వారపూడి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు భార్య వరలక్ష్మి, ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. మండపేట రూరల్, ద్వారపూడి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ వెంకట్రావు సీఎం క్యాంప్ కార్యాలయంలో డ్యూటీ నిర్వహిస్తున్నారు. సెలవుపై ఇంటికి వచ్చిన ఆయన గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంకట్రావుకు అతిగా మద్యం తాగే అలవాటు ఉంది. కొంత కాలంగా ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం సీఎం క్యాంప్ ఆఫీసులో డ్యూటీకి హాజరు కావలసి ఉంది. ఇంటి వద్ద నుంచి డ్యూటీకి వెళ్లి వస్తున్నానని చెప్పి బయటకు వచ్చి పుష్కర ఘాట్‌లో నదిలోకి దిగి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు మరణ వాగ్మూలం (సూసైట్ నోట్)లో ‘నేను తప్పులు చేశాను.. చావు ఒక్కటే పరిష్కారం ..నా చావుకు ఎవరూ కారణం కాదు.. నేను లేకపోయినా అమ్మను నాన్నను బాగా చూసుకో అంటూ భార్య వరలక్ష్మికి లేఖ రాసి ఆత్మహత్యకు ప్పాల్పడ్డారు. సూసైట్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. త్రీటౌన్ ఎస్సై వెంకటేశ్వరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సిబ్బంది సంతాపం
కానిస్టేబుల్ వెంకట్రావు మృతికి మండపేట రూరల్, ద్వారపూడి పోలీస్ స్టేషన్ ఎస్సై విద్యా సాగర్, పోలీస్ సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి సంతాపం వ్యక్తం చేశారు. డ్యూటీలో చురుగ్గా ఉండే వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడడంపై విచారం వ్యక్తం చేశారు.
కన్నీటి వీడ్కోలు
పెదపళ్ల (ఆలమూరు) : ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్ జొన్నాడ వెంకటేశ్వరరావు (43)కు పెదపళ్లలో పోలీసు అధికారులు కన్నీటి వీడ్కోలు పలికారు. గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు ప్రస్తుతం మండపేట రూరల్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో రాజమహేంద్రవరంలో ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్వరరావు భౌతిక కాయాన్ని స్వగ్రామమైన పెదపళ్లకు శుక్రవారం తీసుకువచ్చారు. మండపేట రూరల్ సర్కిల్ పోలీసు స్టేషన్ పర్యవేక్షణలో అధికారులు అధికార పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మండపేట రూరల్ సీఐ వి.పుల్లారావు, ఎస్సైలు పి,దొరరాజు, సీహెచ్.విద్యాసాగర్ తదితరులు వెంకటేశ్వరరావు బౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.