
ఒప్పందం బెడిసి కొట్టి.. ఒకరి బలి
శంషాబాద్: ఇచ్చిన మాట ప్రకారం డబ్బులివ్వాలని అడిగినందుకు ఓ వ్యక్తిని కొట్టి చంపారు. శంషాబాద్ డీసీపీ ఎ.ఆర్ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన దయాల్ సదా (54) సాతంరాయిలోని సంజీవరెడ్డి ఫాంహౌస్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. రెండు నెలల క్రితం సరూర్‌నగర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన వై. సురేష్ (25) తో తనుండే ఫాంహౌస్‌లో గొర్రెలను మేపుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందంలో భాగంగా నాలుగు గొర్రె పిల్లలను దయాల్‌కు ఇచ్చాడు. ఇది తెలిసిన తోట యజమాని హెచ్చరించటంతో సురేష్ గొర్రెలు మేపుకోవడానికి దయాల్ అభ్యంతరం తెలిపాడు.
దీంతో సురేష్ తన గొర్రె పిల్లలను వెనక్కి తీసుకున్నాడు. కొన్ని రోజులు మేపుకున్నందుకు ఎంతో కొంత ఇవ్వాలని దయాల్ పట్టుబట్టడంతో రూ.5 వేలు ఇచ్చేందుకు సురేష్ అంగీకరించాడు. సురేష్ ఇచ్చిన గడువు దాటడంతో దయాల్ తరచూ ఫోన్ చేయసాగాడు. దీంతో కోపం పెంచుకున్న సురేష్ స్థానికంగా మరో ఫాంహౌస్‌లో పనిచేస్తున్న సంతోష్‌రెడ్డి (29), మహ్మద్ హాజీ (19) లతో కలసి జూలై 30న రాత్రి దయాల్‌ను కర్రతో బలంగా మోదారు. తీవ్రంగా గాయపడిన దయాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి తీసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, సోమవారం రిమాండుకు తరలించారు.