
కాంట్రాక్ట్ లెక్చరర్ ఆత్మహత్యాయత్నం
– పెట్రోల్ తాగి.. ఆపై ఒంటిపై పోసుకుని..
– నిప్పంటించుకుంటుండగా అడ్డుకున్న సహచరులు
– ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని ఆరోపణలు
– మోత్కూరులో ఘటన
మోత్కూరు:
ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేకపోతున్నాని ఆరోపిస్తూ ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. బాధిత లెక్చరర్‌తో పాటు సహచర లెక్చరర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండల కేంద్రానికి చెందిన ఎం.మల్లిఖార్జున్ జనరల్‌ఫౌండేషన్ కోర్సు ఓకేషనల్ (జీఎఫ్‌సీ) కాంట్రాక్ట్ లెక్చరర్‌గా మర్రిగూడ కాలేజీలో 13 సంవత్సరాలుగా పనిచేశాడు. మూడేళ్ల క్రితం బదిలీపై వచ్చి మోత్కూరు జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. మల్లికార్జున్ గురువారం ఉదయం కళాశాలకు చేరుకుని ప్రిన్సిపాల్ తన బాండ్‌ను రెన్యూవల్‌కు పంపడంలేదని మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే మల్లిఖార్జున్ తన బైక్‌లో ఉన్న పెట్రోల్ బాటిల్‌తీసి కొంత తాగి శరీరంపై పోసుకునిఅగ్గిపుల్లతో నిప్పంటించుకోబోయాడు. గమనించిన తోటి లెక్చరర్లు అతడిని అడ్డుకున్నారు. అనంతరం 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. మూడు సంవత్సరాలుగా ఇంటర్‌పబ్లిక్ వార్షిక, సప్లమెంటరీ పరీక్షల రెమ్మునరేషన్ కోసం విధులు నిర్వహించిన వారితో ప్రిన్సిపాల్ ఎక్వీటెన్స్‌లో సంతకాలు చేయించుకుని డబ్బులు చెల్లించలేదని మల్లిఖార్జున్‌తో పాటు పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆరోపించారు.
ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ల్చెరర్స్‌ను పలు రకాలుగా వేధింపులకు గురిచేస్తున్న ఇన్‌చార్జీ ప్రిన్సిపాల్ చొప్పరి పరమేశ్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ గురువారం కళాశాల ఆవరణలో ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సాయంత్రం ప్రిన్సిపాల్ తన కారులో వెల్లిపోతుండగా లెక్చరర్లు అడ్డుకుని ఘెరావ్ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి వి.కొండల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పేరుమాల్ల రాజులు మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ పరమేశ్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను, అధ్యాపకులను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యతీసుకోవాలన్నారు. మల్లిఖార్జున్ అనే లెక్చరర్‌ను ప్రిన్సిపాల్ మానసికంగా వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. మహిళా లెక్చరర్లపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. రెన్యూవల్ బాండ్‌కోసం ఒక్కో లెక్చరర్ వద్ద రూ. 10వేలు ప్రిన్సిపాల్ డిమాండ్ చేశాడని ఆరోపించారు. విచారణ జరిపి తగు చర్య తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె.అన్సారీ, జిల్లా కార్యనిర్వహక అధ్యక్షుడు విజయ్‌కుమార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫయాజ్, నర్సిరెడ్డి, పరుశరాములు, వెంకట్‌రెడ్డి, శ్వేత, మంజుల, వై.నర్సిరెడ్డి, శ్యామ్, లింగస్వామి, నర్సింహ్మ ఉన్నారు.
వేధించలేదు : ప్రిన్సిపాల్
కాంట్రాక్ట్ లెక్చరర్లను వేధించడంలేదని , విధులు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పడంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రిన్సిపాల్ పరమేశ్ తెలిపారు. ప్రిన్సిపాల్ అని కూడా చూడకుండా తిరుగుబాటు ధోరణిలో మల్లికార్జున్ అనే లెక్చరర్ మాట్లాడాడని చెప్పాడు. అటెండెన్స్, బయోమెట్రిక్ విధానం ద్వారా జరుగుతున్నందున ఎవ్వరి రెన్యూవల్ బాండ్‌లు ఆపడం లేదని చెప్పారు.