పదో పీఆర్సీ ప్రకారం వేతనాలివ్వాలి
► కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరవధిక సమ్మె
► పలువురి సంఘీభావం
పెద్దపల్లిఅర్బన్ : ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో కళాశాలల్లో అధ్యాపకులుగా పని చేస్తున్నామని, తమను క్రమబద్ధీకరణ చేయాలని అనేకమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ను క్రమబద్ధీకరిస్తామని జీవో 16ను విడుదల చేసిందని, ఆ ప్రక్రియ ఇప్పటివరకు పూర్తి కాలేదని తెలిపారు. క్రమబద్ధీకరణ ఆలస్యమైతే ప్రస్తుతం అమలవుతున్న పదో పీఆర్సీ ప్రకారం బేసిక్ పే, డీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సునీల్, పవన్ కుమార్, శ్రీనివాస్, విక్రమాదిత్య, శంకరయ్య, రమేశ్, శ్రీధర్‌రావు, సంతోషి, లలిత, రాజ్యలక్ష్మి, కవిత, ప్రశాంతి పాల్గొన్నారు.
పలువురి మద్దుతు
కాంట్రాక్ట్ లెక్చరర్ల సమ్మె శిబిరాన్ని పెద్దపల్లి నగర పంచాయతీ చైర్మన్ ఎల్.రాజయ్య సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు సహకారంతో ప్రభుత్వానికి సమస్యలను విన్నవించి పరిష్కారం కోసం చొరవ తీసుకుంటానన్నారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ బాలసాని లెనిన్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్, నాగరాజు సంఘీభావం తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు.