
హామీలు అమలు చేయాలి
విజయవాడ (గాంధీనగర్) : పీఆర్‌సీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం, ఎన్నికల హామీ మేరకు క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు చేపట్టిన ఆందోళన 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు ధర్నాచౌక్‌లో శుక్రవారం కొబ్బరిబోండాలు విక్రయిస్తూ నిరసన తెలియజేశారు. తాము 16ఏళ్లుగా చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోయారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నా, సీఎం చంద్రబాబుకు చేతులు రావడం లేదన్నారు. ప్రభుత్వ కళాశాలలపై పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులరైజ్ చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు చేస్తున్న ఆందోళనకు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, కార్యదర్శి అజయ్‌కుమార్, కేవీపీఎస్ అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులపై వివక్ష చూపుతోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు ఇష్టారాజ్యంగా పెంచుతున్న ప్రభుత్వం... కష్టపడి పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. జేఏసీ నాయకులు జీఎం దయాకర్, కేవీ కృష్ణంరాజు, రాంబాబు, వి.గిరి, విజయ్, సుధారాణి, జ్యోతి, సునీత, లత పాల్గొన్నారు.