మీ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తా
కాంట్రాక్టు అధ్యాపకులకు జగన్ భరోసా
మధురపూడి/రాజానగరం : ‘మీ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తా, మీకు మేలు జరిగేలా ప్రయత్నిస్తా’ అని ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగ భద్రత కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న రాష్ట్రంలోని కాంట్రాక్టు అధ్యాపకులు బుధవారం కోరుకొండ మండలం, బూరుగుపూడి సెంటర్‌లో జగన్‌ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. 16 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తూ, కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతాన్ని పెంపొందిస్తున్నా తమకు ఉద్యోగ భద్రతను కల్పించడంలో ప్రభుత్వ కాలయాపన చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కారిస్తామంటూ త్రిసభ్య కమిటీని వేసిన ప్రభుత్వం ఆ కమిటీ ఇచ్చిన నివేదికను ఆచరణలోకి తీసుకురావడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. పదో పీఆర్సీ సూచించినట్టు వేతనాల్లో పెరుగుదల తీసుకురావాలన్నారు. తమ కుటుంబాలు అర్థాకలితో అలమటిస్తున్నాయని, వీధిన పడకుండా ఆదుకోవాలంటూ వేడుకున్నారు. దీని పై స్పందించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పై విధంగా భరోసానిస్తూ మీకు అండగా మేముంటామన్నారు. అధికారమే పరమావధిగా చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి అంటూ యువతను మాయమాటలతో మోసంగించాడన్నారు. అలాగే రైతులను, డ్వాక్రా మహిళలను కూడా రుణ మాఫీ అంటూ మోసగించిన మాయలమరాఠీ చంద్రబాబు అన్నారు. ఉద్యమతీవ్రతను పెంచితేగాని ఆయన స్పందించరంటూ వారి ఉద్యమానికి ఆయన పూర్తి మద్దతును ప్రకటించారు. జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో ఏపీ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకులు జేఏసీ నాయకులు యార్లగడ్డ రాజాచౌదరి, జిల్లా అధ్యక్షుడు వలుపు కనకరాజు, వీరబాబుచౌదరి, కె.లక్ష్మిదేవి, దడాల శ్రీనివాస్ పాల్గొన్నారు.