కాంట్రాక్టు అధ్యాపకులకు న్యాయం చేయండి
Published Thu, Aug 11 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
13న భవిష్యత్తు కార్యచరణ కోసం గుంటూరులో సమావేశం
రాజానగరం : రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులకు సరైన న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇదే విషయమై సమావేశంలో చర్చించి, భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకు ఈనెల 13న గుంటూరులోని యూటీఎఫ్ స్టేట్ కౌన్సిల్ భవనంలో ఉదయం 10 గంటలకు రాష్ట్ర స్థాయి సమావేశం జరుగనుందని సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ వి. కనకరాజు తెలిపారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయం (2000 సం)లో కాంట్రాక్టు పద్ధతిలో నియమితులై, నేటికీ చాలీచాలని జీతాలతో విద్యార్థులకు విద్యా బోధన చేస్తూ జీవితాలను నెట్టుకొస్తున్న తమపై ప్రభుత్వం కరుణ చూపకపోవడం విచారకరమన్నారు. 2014 ఎన్నికలల్లో టీ డీపీ తిరిగి అధికారంలోకి వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశించామన్నారు. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారన్నారు. అయితే ఆ సంఘాన్ని వేసి రెండేళ్లవుతున్నా ఇంత వరకు ఎటువంటి ప్రగతి లేదన్నారు. కనీసం జీతాలు కూడా సకాలంలో విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత మార్చి నెల నుంచి జీతాలు రావలసి ఉన్నాయన్నారు. ఇకనైనా కాంట్రాక్టు అధ్యాపకుల పట్ల సరైన నిర్ణయం ప్రకటించకపోతే న్యాయ పోరాటం చేయకతప్పదని హెచ్చరించారు.
Advertisement