
కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన ర్యాలీ
విజయవాడ(గాంధీనగర్) : ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ చేపట్టిన ఆందోళన పదో రోజుకు చేరింది. ఆందోళనలో భాగంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు శనివారం కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. అలంకార్ సెంటర్‌లోని ధర్నాచౌక్‌లో ప్రారంభమైన ప్రదర్శన లెనిన్ సెంటర్, ఏలూరు రోడ్డుమీదుగా తిరిగి ధర్నా చౌక్‌కు చేరుకుంది. కాంట్రాక్ట్ అధ్యాపకులు చేస్తున్న ఆందోళనకు బీజేఎంఎం రాష్ట్ర కార్యదర్శి పోతంశెట్టి నాగేశ్వరరావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్దీకరించి పీఆర్‌సీ ప్రకారం వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు జీఎం దయాకర్ మాట్లాడుతూ 16 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి మించి పోయిందన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి కాంట్రాక్ట్ అధ్యాపకుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు డి.మున్వర్, మహిళా కార్యదర్శి మంజుల, కేవీ కృష్ణంరాజు, బీజేౖఎంఎం సిటీ అధ్యక్ష, కార్యదర్శులు మేకల వెంకటేశ్వరరావు, కె మల్లేశ్వరరావు పాల్గొన్నారు.