బతుకుదెరువుకు వచ్చి..
బతుకుదెరువుకు వచ్చి..
Published Sat, Oct 29 2016 10:22 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
* విగతజీవుడిగా మారి
* రాజుకాల్వలో అనుమానాస్పద స్థితిలో
కలకత్తాకు చెందిన కూలీ మృతి
రాజుకాల్వ (రేపల్లె): పొట్టకూటి కోసం పనులకు వచ్చి అనుమానాస్పద స్థితిలో ఒక కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని రాజుకాల్వ గ్రామంలో శనివారం వెలుగు చూసింది. రేపల్లెలో 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కలకత్తాకు చెందిన కాంట్రాక్టర్ పాల్ రొయ్యల చెరువుల్లో బోర్లు వేసేందుకు కలకత్తాకు చెందిన మిటూన్, భీమల్, కాజోన్, సామిన్‌లను ఈ నెల 27వ తేదీన రాజుకాల్వ పిలిపించాడు. వీరు కేశంనేని సాంబశివరావుకు చెందిన చెరువుల వద్ద ఏర్పాటు చేసిన షల్టర్‌లో ఉంటున్నారు. పనులు ఇంకా ప్రారంభించలేదు. ప్రస్తుతం బోర్లు వేసేందుకు వచ్చిన ఆర్డర్‌లతో పాటు మరికొన్ని ఆర్డర్లు రావటంతో కాంట్రాక్టర్ పాల్ మరికొంత మంది కూలీలను తీసుకువచ్చేందుకు కలకత్తా వెళ్ళాడు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ పాల్ కుమారుడు సోనూ కూలీల బాగోగులు చూసుకునేందుకు రాజుకాల్వలో ఉంటున్న షెల్టర్‌లో చూడగా అక్కడ ఎవరూ కనిపించలేదు. బ్యాగులు ఒకదానిపై ఒకటి ఉండడం గమనించి వాటిని సర్దేందుకు ప్రయత్నించాడు. సమీపంలోని పరదాపట్టా కింద భీమల్(37) మృతదేహం కనిపించడం, మిగిలిన వారి జాడలేకపోవటంతో భయానికి గురై చుట్టుపక్కల వారిని కేకలు వేయగా వారు వచ్చి పరిస్థితిని పోలీసులకు తెలిపారు. రూరల్ సీఐ పెంచలరెడ్డి, చోడాయిపాలెం ఎస్సై పి.శివాజీ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల డీఎస్పీ పి.మహేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
మిగిలిన వారిపైన అనుమానం..
పనులకోసం కలకత్తా నుంచి వచ్చిన నలుగురిలో ఒకరు మృతి చెందటం, ముగ్గురు కనిపించకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుడు భీమల్‌తో పాటు వచ్చిన వారే భీమల్‌ను చంపి ఉంటారా, లేదా ఇతర కారణాలతో మృతి చెందాడా అనే కోణాలలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహంపై గాయాలు ఉండటం, ప్రస్తుతం మృతదేహం ఉన్న పరిస్థితినిబట్టి హత్య జరిగి ఉండవచ్చని, శుక్రవారమే సంఘటన జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Advertisement