విద్యుదాఘాతంతో సెంట్రింగ్ కూలీ మృతి
Published Wed, Jan 18 2017 12:21 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
ఎమ్మిగనూరు రూరల్: విద్యుదాఘాతంతో సెంట్రింగ్ కూలీ మృతి చెందిన సంఘటన మంగళవారం ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన రాజు (35) సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య సునంద, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణి, మరో ఐదు రోజుల్లో ప్రసవం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో రాజు మంగళవారం గాంధీనగర్‌లో ఓ ఇంటి నిర్మాణానికి అమర్చిన సెంట్రింగ్ కర్రలు తీసేందుకు వెళ్లాడు. కర్రలు తీస్తున్న సమయంలో పక్కనే విద్యుత్ తీగలు తాకింది. అప్పటికే భవనానికి క్యూరింగ్ నిమిత్తం నీళ్లు చల్లడంతో కర్ర తడిగా ఉంది. దీంతో రాజు విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న కుటుంబీకులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. గర్భిణి అయిన భార్య రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Advertisement
Advertisement