
బంగారు తెలంగాణకు సహకరించాలి
- డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
- అట్టహాసంగా ప్రపంచ తెలంగాణ మహాసభలు ప్రారంభం
- అలరించిన రసమయి ఆటాపాటా
రాయికల్ (కరీంనగర్) : సీఎం కేసీఆర్ కలలుకంటున్న బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. అమెరికాలోని డెట్రాయిట్‌లో అమెరికా తెలంగాణ సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ప్రథమ ప్రపంచ తెలంగాణ మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. శ్రీహరి మాట్లాడుతూ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేం దుకు వివిధ దేశాలు పోటీ పడుతున్నాయన్నారు. ప్రవాస తెలంగాణవాదులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కవితకు నిర్వాహకులు బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు.
కడియం శ్రీహరి, తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌లతో కలసి ఆమె తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రసమయి ఆటాపాటా అలరించింది. ప్రవాస తెలంగాణవాదులు తెలంగాణ పాటలపై స్టెప్పులేశారు. కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ కళాకారులతో కలసి బతుకమ్మ ఆట ఆడారు. కార్యక్రమంలో చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, నిర్వాహకులు రాంమోహన్, వినోద్‌కుమార్, నాగేందర్, కరుణాకర్ పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాలు విస్తరించాయి: యార్లగడ్డ
దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఐదు, ఆరు ఉండగా తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉండడంలో తప్పు లేదని, తెలుగు రాష్ట్రాలు విస్తరించాయే తప్ప... విడిపోలేదని రాజ్యసభ మాజీ సభ్యులు, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఇద్దరు సీఎంలు ఒకరింటికి మరొకరు వెళ్లి వారి వ్యక్తిగత కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లే ఇరు రాష్ట్రాల మధ్య చిన్నచిన్న సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. బంగారు తెలంగాణ వద్దని, దాశరథి ఆశించినట్లు కోటి రతనాల వీణగా బాసిల్లే తెలంగాణ కావాలని ఆకాంక్షించారు.