విద్యుత్ బిల్లులు సరిచేస్తాం
జంగారెడ్డిగూడెం: పోలవరం ప్రాజెక్ట్ పునరావాస కాలనీ వాసులకు అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లులు సరిచేస్తామని ఏపీ ఈపీడీసీఎల్ ఏడీఈ కె.గోపాలకష్ణ తెలిపారు. ఈనెల 17న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పునరావాసంలో విద్యుదావేశం’ శీర్షికన కథనానికి ఈపీడీసీఎల్ అధికారులు స్పందించారు. స్థానిక పేరంపేట రోడ్డులో రామయ్యపేట, పైడిపాక పునరావాస కాలనీలో గురువారం ఏడీఈ కె.గోపాలకృష్ణ, లక్కవరం ఏఈ కె.వెంకటేశ్వరరావు, అకౌంట్స్ అధికారి కె.ఉమామహేశ్వరరావు, ఎల్‌ఐ పి.గణేష్‌బాబు, లైన్‌మన్ వి.జాన్ పర్యటించారు. కాలనీలో అయా ఇళ్లకు తీసిన విద్యుత్ బిల్లులను పరిశీలించారు. ప్రతి ఇంటా తిరిగి విద్యుత్ మీటర్లలో నమోదైన రీడింగ్‌ను పరిశీలించారు. అనంతరం ఏడీఈ మాట్లాడుతూ ఈ రెండు కాలనీలకు సంబంధించి ఏప్రిల్ నెలలో మీటర్లకు ప్రభుత్వం నుంచి నగదు చెల్లించారని, అయితే కాలనీవాసులు తమ ఆధార్‌కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలు దశల వారీగా ఇవ్వడంతో మీటర్లు ఆన్‌లైన్ కాలేదన్నారు. అయినా కాలనీవాసులు విద్యుత్ వినియోగిస్తున్నారని చెప్పారు. ఇటీవల 60 కనెక్షన్లు ఆన్‌లైన్ కాగా వాటి విద్యుత్ రీడింగ్ తీశామన్నారు. నాలుగైదు నెలలకు ఒకే ప్లాట్‌గా రీడింగ్ తీయడం వల్ల శ్లాబు రేటు ఎక్కువగా పడిందని చెప్పారు. అధికంగా వచ్చిన బిల్లులు పరిశీలించి రీడింగ్ మొత్తాన్ని ఏ నెలకు ఆనెల సరిచేసి మరలా కొత్త బిల్లులు జారీ చేస్తామని, దీని వల్ల వినియోగదారులకు రూ.500 నుంచి రూ.1,500 వరకు బిల్లు తగ్గే అవకాశం ఉందన్నారు. రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కాలనీవాసులకు ఏడీఈ హామీ ఇచ్చారు.