నిర్లక్ష్యపు చీకటికి శస్త్రచికిత్స!
నిర్లక్ష్యపు చీకటికి శస్త్రచికిత్స!
Published Sat, Jun 24 2017 10:23 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
పెద్దాసుపత్రిలో దిద్దుబాటు చర్యలు
- విద్యుత్ సమస్యపై ఎలక్ట్రీషియన్ల తొలగింపు
- అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ రద్దు
- ఆసుపత్రిలో డీఎంఈ, జిల్లా కలెక్టర్ పర్యటన
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రెండురోజుల పాటు విద్యుత్‌సరఫరాలో నెలకొన్న సమస్యకు సంబంధించి ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు మొదలెట్టారు. సమస్యకు బాధ్యులుగా చేస్తూ ముగ్గురు ఎలక్ట్రీషియన్లను విధుల నుంచి తొలగించారు. వీరిని నియమించిన ఏజెన్సీని రద్దు చేశారు. విద్యుత్‌సరఫరా, మరమ్మతుల బాధ్యతను తాత్కాలికంగా ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.
శుక్రవారం రాత్రి సైతం బుధవారం రాత్రి తరహాలోనే విద్యుత్ సమస్య ఏర్పడటంతో టీబీవార్డు, ట్రమటాలజి, మెడికల్, చిన్నపిల్లల విభాగం, న్యూరాలజి, ఎండోక్రైనాలజి, పీడియాట్రిక్ సర్జరీ విభాగాల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి ఏడు గంటల సమయంలో గాలి, వానకు విద్యుత్ సమస్య ఏర్పడింది. మరమ్మతులు చేయాల్సిన ఎలక్ట్రీషియన్లు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి రెండు మొబైల్ జనరేటర్లను తెప్పించి రాత్రి 2 గంటల సమయంలో సరఫరాను పునరుద్ధరించారు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఎలక్ట్రిషియన్లు వచ్చి మరమ్మతులు చేశారు.
మంత్రి కామినేని ఆగ్రహం..
ఆసుపత్రిలో సమస్య వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా డీఎంఈ డాక్టర్ సుబ్బారావు, జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణను ఆదేశించారు. దీంతో వీరిద్దరూ శనివారం ఆసుపత్రిలో వేర్వేరు సమయాల్లో పర్యటించారు. ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ భార్గవరాముడిని వెంటపెట్టుకుని ఆసుపత్రిలో ఎక్కడకెక్కడ విద్యుత్ సమస్యలున్నాయో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు.
సమస్య పునరావృతం కాకుండా చర్యలు..
ఆసుపత్రిలోవిద్యుత్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు డీఎంఈ సుబ్బారావు తెలిపారు. వచ్చే జులైలో స్టేట్ క్యాన్సర్ సెంటర్‌కు అనుమతి వస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఇకపై విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎలక్ట్రీషియన్ల తొలగించామన్నారు. పురాతనమైన విద్యుత్ స్తంభాలతో పాటు జంపర్లు కూడా పాతవై పోయాయన్నారు. వీటిని మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. డీఎంఈ, కలెక్టర్ వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పి. చంద్రశేఖర్. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ విజయభాస్కర్, డీఈ మహేశ్వరరెడ్డి తదితరులున్నారు.
‘పవర్’ రాజకీయంపై ఇంటెలిజెన్స్ ఆరా..!
ఆసుపత్రిలో ‘పవర్’ రాజకీయం నడుస్తోందా అన్న కోణంలో ఇంటెలిజెన్స్, ఎస్‌బీ పోలీసులు శనివారం ఆరా తీశారు. శుక్రవారం రాత్రి విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి ఒక్కరే రాత్రి 3 గంటల వరకు ఉండి పనులు చేయించారని, ఇతర అధికారులు ఎందుకు అక్కడికి రాలేదని ఆరా తీశారు. నలుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లున్నా ఏ ఒక్కరికీ అధికారాలు ఇవ్వలేదా...ఒకవేళ ఇచ్చినా వారు సద్వినియోగం చేసుకోవడం లేదా అన్న కోణంలో పలువురు వైద్యులు, అధికారులను ఆరా తీశారు.
దీనికితోడు ఇటీవలే ఏఆర్‌ఎంఓగా వచ్చిన డాక్టర్ వసుధను ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో డాక్టర్ పి. చంద్రశేఖర్ కార్డియాలజి విభాగానికి డిప్యూటేషన్‌పై నియమించుకున్నారు. అప్పటి నుంచి ఏఆర్‌ఎంఓ పదవిలో ఏ ఒక్కరూ విధులు నిర్వహించలేదని తెలుసుకున్నారు. వర్షాకాలంలో విద్యుత్ అంతరాయం ఏర్పడటం సహజమని, సిబ్బంది రాత్రయినా సరే అరగంట నుంచి గంటలోపు పరిష్కరిస్తున్నారు. అలాంటిది ఏకంగా 12 గంటల పాటు పరిష్కరించకపోవడానికి కారణాలను ఎస్‌బీ పోలీసులు తెలుసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం.
Advertisement
Advertisement