ఆయన కిక్కుకో లెక్కుంది!
►ఓ మద్యం దుకాణం చెప్పిన అవినీతి కథ
►అనధికార వైన్‌షాపునకు అండాదండా ఆయనే
►కోర్టు తీర్పులు, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్
►చోద్యం చూస్తున్న డిప్యూటీ కమిషనర్
►కోర్టుధిక్కారణ కేసు నమోదుకు ఫిర్యాదుదారుల సమాయత్తం
అవిలాల(తిరుపతి రూరల్): ఎక్సైజ్‌శాఖలో ఆయనో సర్కిల్ ఇన్‌స్పెక్టర్. తిరుపతి నగరానికి సమీపంలో విధులు నిర్వర్తించే ఆయన కాసులు ఇస్తే నిబంధనలు తుంగలో తొక్కుతారని సొంత డిపార్ట్‌మెంట్ సిబ్బంది నుంచే ఆరోపణలు ఉన్నా యి. ఇది ఎంతగా అంటే కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతారు చేసి మరీ అడ్డదారి లో షాపులు ఏర్పాటు చేసేంత ‘లెక్క’ లేని తనం తన సొంతమని చెప్పుకుంటారు. తప్పుడు అడ్రస్‌తో ఏర్పాటు చేసిన షాపును ఎత్తివేయాలని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని ఆ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తప్పుడు అడ్రస్‌తో షాపు నిర్వాహణ..
తిరుపతి రూరల్ మండలం రామానూజపల్లి చెక్‌పోస్ట్ నుంచి మహిళావర్సిటీకి వచ్చే దారిలో ఓ వైన్ షాపును 33 రోజుల క్రితం ఏర్పాటు చేశారు. వేదాంతపురం అడ్రస్‌తో అనుమతి వచ్చిన ఈ షాపును నిబంధనలకు విరుద్ధంగా అవిలాల పంచాయతీలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే పంచాయతీలో రెండు షాపులు ఉన్నాయి. మూడోది నిబంధనలకు విరుద్ధమని అవిలాల వైన్స్ నిర్వాహకులు కిషోర్ కుమార్, మల్లంగుంట చిన్ని వైన్స్ అధినేత మునస్వామిరెడ్డి అధికారుల కు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిం చారు. దీంతో షాపును ఎత్తివేయాలని గత నెల 19న కోర్టు తీర్పు ఇచ్చింది.
కోర్టు ఉత్తర్వులు బేఖాతర్
నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన షాపును ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశించినా.. సంబంధిత ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవటం లేదు. ముత్యాలరెడ్డిపల్లిలోని కార్యాలయంలో ఆ త్రిబుల్‌స్టార్ అధికారి మధ్యస్తం పేరుతో ఫిర్యాదుదారులను పిలిపించుకుని బెదిరిస్తున్నట్లు సమాచారం. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైతం కోర్టు ఆదేశాల మేరకు షాపును ఎత్తివేయాలని ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలను సైతం పట్టించుకోని సదరు అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన షాపును మాత్రం కంటికి రెప్పలా కాపాడుతుండడంపై సిబ్బంది సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్సైజ్ కమిషనర్‌కు.. ఫిర్యాదు చేస్తాం
అవిలాల పంచాయతీలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వైన్‌షాపును ఎత్తివేయాలని ఎన్నిసార్లు విన్నవించినా స్పందించకపోవడం దారుణం. కోర్టు ఆదేశాలు సైతం పట్టించుకోని ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తప్పుడు అడ్రస్‌తో ఏర్పాటు చేసిన షాపు వల్ల రోజుకు రూ.8 వేలు నష్ట పోతున్నాం. గత 33 రోజులుగా మాకు జరిగిన నష్టాన్ని అధికారులే చెల్లించాలి. అధికారి తీరుపై కోర్టు ధికార్కణ కేసు నమోదు చేయడమే కాకుండా కమిషనర్‌కు సైతం ఫిర్యాదు చేస్తాం.
– కిషోర్‌కుమార్, అవిలాల వైన్స్ నిర్వాహకుడు