అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదు
అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదు
Published Thu, Jan 26 2017 1:15 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
ఏలూరు(సెంట్రల్) : ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వారి వివరాలను అత్యంత గోప్యంగా అవినీతి నిరోధక శాఖ సేకరిస్తోందని, శాఖ కార్యాలయాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియలో ఉన్నామని ఏసీబీ డైరెక్టర్ జనరల్(డీజీ) ఆర్‌పీ ఠాకూర్ తెలిపారు. బుధవారం జిల్లా ఏసీబీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. తొలుత నిర్మాణంలో ఉన్న ఏసీబీ కొత్త భవనాన్ని ఆయన పరిశీలించి, కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. నిర్మాణంలో జాప్యంపై ప్రశ్నించారు. వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అవినీతి నిరోధక శాఖ 2015–16 సంవత్సరాలలో జిల్లాలో నమోదు చేసిన కేసులను సమీక్షించేందుకు వచ్చానని తెలిపారు. అవినీతికి పాల్పడేవారెవరైనా ఉపేక్షించేది లేదని, డిజిటలైజేషన్‌లో భాగంగా ఇప్పటికే అవినీతి నిరోధక శాఖకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రత్యేక వాట్సప్ నంబరును అందుబాటులో ఉంచామన్నారు. అవినీతికి పాల్పడే వారి వివరాలను తమకు వాట్సప్ ద్వారా తెలియజేస్తే చాలని, తదుపరి తాము ఆయా అంశాలపై విచారణ జరిపి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. తాను కొత్తగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ నంబరును (8333995858) ప్రజలకు అందుబాటులో తెచ్చానని, ఇప్పటికే రాష్ట్రంలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఠాకూర్ తెలిపారు. ఏసీబీ అదనపు డీజీ అబ్రహాం లింకన్, జాయింట్ డైరెక్టర్ మోహనరావు, డీఎస్పీ గోపాలకృష్ణ, సీఐ యుజె.విల్సన్, ట్రాఫిక్ డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్ ఆయనతోపాటు ఉన్నారు.
Advertisement
Advertisement