నగరపాలక సంస్థ .. అవినీతిమయం
– ఎమ్మెల్యే హత్యలను ప్రోత్సహిస్తున్నారు
– మేయర్ కుటుంబానికి ముడుపులిస్తేనే అనుమతులు
– ఆధిపత్య పోరుతో సమస్యలు పట్టించుకోవడం లేదు
– మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి
అనంతపురం న్యూసిటీ : 'పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి నగరపాలక సంస్థలో ఏ విభాగంలో చూసిన అవినీతే రాజ్యమేలుతోంది. మేయర్ స్వరూప కుటుంబానికి ముడుçపులిస్తేనే టౌన్ ప్లానింగ్ అధికారులు భవన నిర్మాణాలకు అనుమతులిస్తారు. ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి నిర్దేశించిన వారికే టెండర్. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వైకుంఠం, మేయర్ స్వరూపల ఆధిపత్యపోరుతో నగర సమస్యలను గాలికొదిలేశారు’ అని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆరోపించారు.
శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర ప్రజలకు గుక్కెడు మంచినీరందించలేని నిస్సహాయ స్థితిలో పాలకులున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లకు పదిశాతం ఇస్తేకానీ అభివృద్ధి పనులు మొదలుపెట్టలేని పరిస్థితి నెలకొనిందన్నారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల డివిజన్‌లలో పనులు జరగలేదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌లు నగరాన్ని అధ్వాన్న స్థితికి తెచ్చారని ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారన్నారు.
మేయర్ భూముల కొనుగోలు
సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన మేయర్ స్వరూప అనతికాలంలోనే ఎకరాల భూములు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగిందని గురునాథరెడ్డి ఆరోపించారు. ఇళ్లపై ఇళ్లు నిర్మించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ముద్దలాపురం ప్లాంట్ వద్ద ఫిల్టర్‌బెడ్స్ మార్పిడితో రూ. కోటి వరకు అవినీతి జరిగినా మేయర్ ప్రేక్షకపాత్ర ఎందుకు వహిస్తుస్తున్నారో చెప్పాలన్నారు.
హత్యలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి శాంతియుత పోరాటం చేస్తున్నానని చెబుతూనే హత్యలకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రుద్రంపేట వద్ద జరిగిన గోపీనాయక్ హత్య ఉదంతమని దీనికి నిదర్శనమని గుర్తు చేశారు. అందులో ఎమ్మెల్యే ప్రమేయం లేదా..? అని ప్రశ్నించారు. సంఘమిత్ర సంస్థ పేరిట మునిసిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని భవనాలు నిర్మిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అవినీతి కోట్లకు చేరుతోందన్నారు. మేయర్, ఎమ్మెల్యే కుమ్మక్కై ఏపీఎండీపీ పైప్‌లైన్ ఐహెచ్‌పీ కంపెనీతో రూ.7 కోట్లు తీసుకున్నారన్నారు. కాంట్రాక్టర్లతో లోపాయికార ఒప్పందాలు చేసుకోవడం కారణంగా వారు పైప్‌లైన్ పనులఽను ఇష్టారాజ్యంగా చేస్తున్నారని చెప్పారు.
ఎంపీ మాటలేమయ్యాయి.?
ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పాలకవర్గం ఏర్పడ్డాక నగరంలో ఒక్క పంది కూడా లేకుండా చేస్తామని చెప్పారన్నారు. ఈ రోజు ఆ ఊసే లేకుండా పోయిందని, పందుల తరలింపులో కుమ్ములాడుకుంటున్నారన్నారు. పాతూరులో వ్యాపారులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఒకరు రోడ్డు విస్తరణ చేద్దామనీ... మరొకరు వద్దని... అసలు వీళ్లు అభివృద్ధికి శ్రీకారం చుట్టారా..? లేక వీరి వ్యక్తిగత అభివృద్ధికి నడుం బిగించారా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నదీమ్, మహిళా విభాగం నగరాధ్యక్షురాలు శ్రీదేవి, కార్పొరేటర్లు బాలాంజినేయులు, మల్లికార్జున, బోయ సరోజమ్మ, బోయ గిరిజమ్మ, జానకి పాల్గొన్నారు.