gurunathreddy
-
గుర్నాథ్ రెడ్డిపై ప్రభాకర్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరికపై అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్పందించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రభాకర్ చౌదరి మీడియా చిట్ చాట్‌లో పాల్గొన్నారు. 'అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే గుర్నాథ్ రెడ్డి టీడీపీలోకి వస్తున్నారు. ఆయనది అవకాశవాద రాజకీయం. కబ్జాలు.. హత్యలే ఆయన చరిత్ర. ఆయన మా ప్రత్యర్థి.. ఇపుడు మేము ఎవరితో పోరాడాలి. గతంలో కొంత మంది టీడీపీ నేతలపై చెప్పులు వేయించాడు. జేసీ తప్ప ఆయన చేరికను ఎవరు స్వాగతించడం లేదు. చంద్రబాబు పక్కన నిలబడటానికి కూడా గుర్నాథ్ రెడ్డి సరిపోడు. ఆయన చేరిక కార్యక్రమంలో కూడా నేను హాజరు కాను.. పక్కన నిలబడి ఫొటో దిగేందుకు కూడా నేను ఇష్టపడను. ఇన్ని సంవత్సరాలుగా అసెంబ్లీకి వస్తున్నా.. ఒక గంట కూడా సమావేశాలను మిస్ కాలేదు. కానీ నిన్న(బుధవారం) అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే వెళ్లిపోయాను. నిఖార్సుగా ఉంటే లాభం లేదని అర్థమవుతోంది' అని ప్రభాకర్ చౌదరి మీడియాతో తెలిపారు. చంద్రబాబుతో అత్యవసర భేటీ గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరిక నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి బుధవారం చంద్రబాబు నాయుడుతో అత్యవసరంగా భేటీ అయ్యారు. అవకాశవాది అయిన ఆయన వస్తే పార్టీలో జరగబోయే పరిణామాలపై ప్రభాకర చౌదరి అధినేతకు వివరించినట్టు సమాచారం. అయితే పార్టీ బలోపేతం చేయాలనే గుర్నాథ్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు. 2019 వరకు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగానే ఆలోచన చేయాలని ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. -
బురద జల్లేందుకే ఆరోపణలు
- న్యాయబద్ధంగా మిస్సమ్మ స్థలాన్ని కొనుగోలు చేశాం - చార్జ్‌షీట్ వేసినంత మాత్రాన మేము ముద్దాయిలం కాదు - వైకుంఠం ప్రభాకర్ చౌదరిలా మునిసిపల్ ఆస్తులు దోచుకోలేదు? - మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి అనంతపురం న్యూసిటీ : ‘మిస్సమ్మ స్థలం సీఎస్ఐ సంస్థకు చెందినది. ఆ స్థలాన్ని మా కుటుంబం న్యాయబద్ధంగా కొనుగోలు చేసింది. ప్రజల్లో తమకొస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే రాజకీయంగా బురదజల్లుతున్నారు. ప్రభాకర్ చౌదరి ఓ కళంకిత ఎమ్మెల్యే. ఆయనలాగా మేము మునిసిపల్ ఆస్తులను దోచుకోలేదు. సీఐడీ చార్జ్‌షీట్ వేసినంత మాత్రాన మేము ముద్దాయిలం అవుతామా’ అని మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి అన్నారు. గురువారం బీఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ స్థలంలో ఆయన తన సోదరుడు ఎర్రిస్వామిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పలు ఛానళ్లు, పత్రికలు సీఐడీ కేసు నమోదు చేసిందని, తాము పరారీ అయ్యామని పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఉండాల్సిన మీడియా తమను ముద్దాయిలుగా చిత్రీకరించడం ఏంటని ప్రశ్నించారు. తాము పరారీలో ఉన్నట్లు వార్తలు రావడం హాస్యాస్పదమన్నారు. పీఆర్పీ రేటింగ్స్ పెంచుకునేందుకు అత్యుత్సాహం ప్రదర్శించకూడదన్నారు. తమ ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై తాము పరువునష్టం దావా ఎందుకు వేయకూడదని ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మునిసిపల్ ఆస్తులను వేలం వేయించి వాటిని ఆక్రమించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సంఘమిత్ర పేరుతో అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారు అన్నీ గమనిస్తున్నారని, బీఎన్ఆర్ కుటుంబంపై ఉన్న నమ్మకంతోనే ఐదుసార్లు తమకు పట్టం కట్టారని అన్నారు. కళంకిత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్యవర్తులతో ఓ తప్పుడు నివేదికను తయారు చేసి సీఐడీకి ఫిర్యాదు చేయించారని, దానికి సీఎం చంద్రబాబునాయుడు వంత పాడారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి మిస్సమ్మ స్థల వివాదం తెరపైకి వచ్చిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా లబ్ధి పొందినవారే తాము కాంగ్రెస్ పార్టీ వీడాక ఈ వివాదానికి ఆజ్యం పోశారన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారన్నారు. సీఎస్ఐ చట్టబద్ధత కలిగిన సంస్థ అని, అందులో రిటైర్డు జడ్జిలు, ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారని గుర్తు చేశారు. ఫోర్జరీ చేసి స్థలాన్ని ఆక్రమించుకుంటే వారు చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. తమకు న్యాయస్థానాలపై అపారమైన నమ్మకం, గౌరవం ఉందని, న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పారిపోవాల్సిన అవసరం తమకు ఎంతమాత్రమూ లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడులాగా స్టే తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నించబోమన్నారు. ఈ స్థల వివాదంపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉంటామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కొనుగోలు చేస్తే అక్రమదారులా.. : ఎర్రిస్వామిరెడ్డి ‘ఏడెకరాల స్థలాన్ని న్యాయబద్ధంగా కొనుగోలు చేస్తే మమ్మల్ని అక్రమదారులుగా చిత్రీకరిస్తున్నారు. మరి కొనుగోలే చేయకుండా 20 ఎకరాల్లో భవనాలు, కరెంటు ఆఫీసులు, ప్రహరీ గోడలు నిర్మించివారు ఆక్రమణదారులు కారా?’ అని ఎర్రిస్వామిరెడ్డి ప్రశ్నించారు. 1923లో సీఎస్ఐ సంస్థ ఈ స్థలాన్ని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సైతం అది సీఎస్ఐ సంస్థకు చెందినదేనని పేర్కొందన్నారు. ఆ సంస్థ నుంచి తాము కొనుగోలు చేశామే తప్ప కబ్జాకు పాల్పడలేదన్నారు. నిజానిజాలు త్వరలోనే వెలువడతాయన్నారు. -
మిస్సమ్మ భూమి చట్టపరంగానే కొన్నాం
అనంతపురం : నగరంలోని మిస్సమ్మ స్థలాన్ని తాము చట్టపరంగా కొనుగోలు చేశామని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి స్పష్టం చేశారు. మిస్సమ్మ స్థలం కొనుగోలుకు సంబంధించిన విషయంలో గురునాథరెడ్డి, ఆయన సోదరులు ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డితోపాటు పులివెందులకు చెందిన ప్రకాష్‌రెడ్డి తదితరులపై ప్రత్యేక సీఐడీ కోర్టు చార్జ్‌షీటు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో గురునాథరెడ్డి మాట్లాడారు. తమపై బురదజల్లే కార్యక్రమం తప్ప ఇందులో ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎస్ఐ అనేది చట్టబద్ధమైన సంస్థ అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కుల ప్రకారమే తాము కొనుగోలు చేశామన్నారు. దీనిపై సీఐడీ గతంలోనే విచారణ చేసి ఏమీ లేదని తేల్చిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి చార్జిషీటు వేయించిందని ఆరోపించారు. దీనిపై న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. అమ్మిన వారు ఎవరైనా కేసులు పెట్టారా, పోనీ హక్కుదారులు ఎవరైనా వచ్చారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ కూడా చెల్లించి కొనుగోలు చేశామన్నారు. ఈ స్థలాన్ని తాము కబ్జా చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. కేవలం తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కార్పొరేషన్ ను భ్రష్టు పట్టించారు
అనంతపురం : ‘నగర ప్రజలకు తాగునీరందించలేని నిస్సహాయ స్థితిలో పాలకవర్గం ఉంది. శుద్ధిజలం సరఫరా కాక జనం రోగాలతో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో కలసి ముద్దలాపురం ఫిల్ట్రేషన్ పాయింట్‌ను సందర్శించాం. అంతేకానీ ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. కమీషన్ల కోసం కక్కుర్తి పడుతుందెవరో..ప్రజలను అడిగితే చెబుతారు..కమీషన్ల కోసం కార్పొరేషన్ ను భ్రష్టు పట్టించిందివీురు కాదా..?’ అని మేయర్ స్వరూపపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశాలకు అధికారులతో బిరియానీలు తెప్పించుకునే స్థాయికి దిగజారారన్నారు. కార్పొరేషన్ లో ఎన్నడూ లేని విధంగా అవినీతి రాజ్యమేలుతోందని, ఆ విషయాన్ని అధికారులే విలేకరుల సమావేశం పెట్టి చెబుతున్నారన్నారు. చీపురు కట్ట నుంచి పింఛన్ల పంపిణీ వరకు ప్రతిదాంట్లోనూ అక్రమాలు చేస్తోందెవరో అందరికీ తెలుసన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నాణ్యమైన పైపులు వేయలేదని అందుకే నీరు కలుషితంగా వస్తోందని మేయర్‌కు...ఇప్పుడు అదే కంపెనీ ఏపీఎండీపీ పైప్‌లైన్ చేపడుతోందన్న విషయం తెలియదా..? అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ముద్దలాపురం ఫిల్ట్రేషన్ పాయింట్‌కు వివిధ మీడియా ప్రతినిధులను తీసుకెళ్లి కళ్లారా నిజాలను చూపించారన్నారు. కొన్ని పరికరాలు పని చేయడం లేదని, నీటి శుద్ధి పూర్తి స్థాయిలో జరగడం లేదని అక్కడి సిబ్బందే చెబుతున్నా..మేయర్‌కు అర్థం కావడం లేదన్నారు. కేవలం స్వార్థ రాజకీయాలతో ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేయడం మానుకోవాలని మేయర్‌కు హితవు పలికారు. బీఎన్ఆర్ కుటుంబం సేవలను గుర్తించే ప్రజలు వారికి అండగా నిలిచారన్నారు. ఇప్పటికైనా నీచమైన రాజకీయాలు వీడి ప్రజలకు స్వచ్ఛమైన నీరందించాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బాలాంజినేయులు, గూడూరు మల్లికార్జున, షుకూర్, జానకి, బోయ గిరిజమ్మ, బోయ సరోజమ్మ, బోయ పక్కీరమ్మ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, తదితరులు పాల్గొన్నారు. -
జాస్నవిరెడ్డి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి
– బాధిత కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అనంతపురం సెంట్రల్ : అదనపు కట్నం దాహానికి బలైన జాస్నవిరెడ్డి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని కోవూరునగర్‌లో ఉన్న జాస్నవిరెడ్డి తల్లిదండ్రులు సూర్యప్రతాప్‌రెడ్డి, రేవతి నివాసానికి వెళ్లి వారిని ఓదార్చారు. ఘటనకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వారు బోరున విలపించారు. న్యాయం చేయాలని పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. నెల కాదు.. రెండునెలలు కాదు ఏడాది పాటు కేసును నాన్చుతూ స్టేషన్ల చుట్టూ తిప్పించుకున్నారని తెలిపారు. దీంతో ఇక న్యాయం జరగదని తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. అడిగినంత కట్నం ఇచ్చినా వారికి ధనదాహం తీరలేదని, తమ కుమార్తెను నిత్యం వేధించేవారని చెప్పారు. పెద్దమనుషులుగా వ్యవహరించిన చెన్నారెడ్డి, చార్లెస్ చిరంజీవిరెడ్డి తమ బిడ్డ ఆత్మహత్యకు ముఖ్య కారకులని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. తన ఆత్మహత్యకు ఎవరెవరు కారకులో అన్ని వివరాలనూ మరణవాంగ్మూలంలో తన కుమార్తె వెల్లడించిందన్నారు. ఆ సూసైడ్ నోట్స్‌ను మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఽచదివి చలించిపోయారు. నిందితులను కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరారు. ఈ విషయంపై త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యనేతలతో కలిసి ఎస్పీని కలుస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
నగరపాలక సంస్థ .. అవినీతిమయం
– ఎమ్మెల్యే హత్యలను ప్రోత్సహిస్తున్నారు – మేయర్ కుటుంబానికి ముడుపులిస్తేనే అనుమతులు – ఆధిపత్య పోరుతో సమస్యలు పట్టించుకోవడం లేదు – మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అనంతపురం న్యూసిటీ : 'పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి నగరపాలక సంస్థలో ఏ విభాగంలో చూసిన అవినీతే రాజ్యమేలుతోంది. మేయర్ స్వరూప కుటుంబానికి ముడుçపులిస్తేనే టౌన్ ప్లానింగ్ అధికారులు భవన నిర్మాణాలకు అనుమతులిస్తారు. ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి నిర్దేశించిన వారికే టెండర్. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వైకుంఠం, మేయర్ స్వరూపల ఆధిపత్యపోరుతో నగర సమస్యలను గాలికొదిలేశారు’ అని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆరోపించారు. శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర ప్రజలకు గుక్కెడు మంచినీరందించలేని నిస్సహాయ స్థితిలో పాలకులున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లకు పదిశాతం ఇస్తేకానీ అభివృద్ధి పనులు మొదలుపెట్టలేని పరిస్థితి నెలకొనిందన్నారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల డివిజన్లలో పనులు జరగలేదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్లు నగరాన్ని అధ్వాన్న స్థితికి తెచ్చారని ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారన్నారు. మేయర్ భూముల కొనుగోలు సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన మేయర్ స్వరూప అనతికాలంలోనే ఎకరాల భూములు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగిందని గురునాథరెడ్డి ఆరోపించారు. ఇళ్లపై ఇళ్లు నిర్మించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ముద్దలాపురం ప్లాంట్ వద్ద ఫిల్టర్‌బెడ్స్ మార్పిడితో రూ. కోటి వరకు అవినీతి జరిగినా మేయర్ ప్రేక్షకపాత్ర ఎందుకు వహిస్తుస్తున్నారో చెప్పాలన్నారు. హత్యలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి శాంతియుత పోరాటం చేస్తున్నానని చెబుతూనే హత్యలకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రుద్రంపేట వద్ద జరిగిన గోపీనాయక్ హత్య ఉదంతమని దీనికి నిదర్శనమని గుర్తు చేశారు. అందులో ఎమ్మెల్యే ప్రమేయం లేదా..? అని ప్రశ్నించారు. సంఘమిత్ర సంస్థ పేరిట మునిసిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని భవనాలు నిర్మిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అవినీతి కోట్లకు చేరుతోందన్నారు. మేయర్, ఎమ్మెల్యే కుమ్మక్కై ఏపీఎండీపీ పైప్‌లైన్ ఐహెచ్పీ కంపెనీతో రూ.7 కోట్లు తీసుకున్నారన్నారు. కాంట్రాక్టర్లతో లోపాయికార ఒప్పందాలు చేసుకోవడం కారణంగా వారు పైప్‌లైన్ పనులఽను ఇష్టారాజ్యంగా చేస్తున్నారని చెప్పారు. ఎంపీ మాటలేమయ్యాయి.? ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పాలకవర్గం ఏర్పడ్డాక నగరంలో ఒక్క పంది కూడా లేకుండా చేస్తామని చెప్పారన్నారు. ఈ రోజు ఆ ఊసే లేకుండా పోయిందని, పందుల తరలింపులో కుమ్ములాడుకుంటున్నారన్నారు. పాతూరులో వ్యాపారులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఒకరు రోడ్డు విస్తరణ చేద్దామనీ... మరొకరు వద్దని... అసలు వీళ్లు అభివృద్ధికి శ్రీకారం చుట్టారా..? లేక వీరి వ్యక్తిగత అభివృద్ధికి నడుం బిగించారా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నదీమ్, మహిళా విభాగం నగరాధ్యక్షురాలు శ్రీదేవి, కార్పొరేటర్లు బాలాంజినేయులు, మల్లికార్జున, బోయ సరోజమ్మ, బోయ గిరిజమ్మ, జానకి పాల్గొన్నారు. -
బంద్ విజయవంతం చేయండి
అనంతపురం : ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రుల ప్రకటనలు, ముఖ్యమంత్రి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈనెల 10న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్రబంద్‌ను జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి విజయవంతం చేయాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయి రెండున్నరేళ్లవుతున్నా నేటికీ చంద్రబాబు ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిన్నటి రోజున కేంద్ర మంత్రుల ప్రకటనలతో చంద్రబాబు మాటలన్నీ ఉత్తివేనని తేలిపోయిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని నిన్నటి వరకు ఆశలు పెట్టుకున్న కోట్లాది ప్రజల గుండెల్లో గుణపాలు చెక్కేలా కేంద్రం ప్రకటన చేసిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఈరోజు నీటిమూటలు చేశారని ధ్వజమెత్తారు. వెంకయ్యనాయుడు బొంకయ్యనాయుడులా మారారని ఎద్దేవా చేశారు. రాజ్యసభలో పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని చెప్పిన ఆయన ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తేకుండా కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బయట పడేందుకు కేంద్రం వద్ద సాగిలపడ్డారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్సీపీ ముందు నుంచీ పోరాడుతోందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంతవరకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పోరాటాలు చేస్తామన్నారు. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ఇంటికో ఉద్యోగం ఎక్కడ?
అనంతపురం: ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు..అమలులో విఫలమయ్యారని వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ కార్యాలయంలో ఘనంగా మే డేను నిర్వహించారు.ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురాం, సీనియర్ నేత చవ్వా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు బాసటగా నిలవడంతో పాటు కార్మికుల ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించిన ఘనత దివంగత సీఎం వైఎస్‌కు దక్కిందన్నారు. ప్రస్తుత ప్ర భుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మికులకు అండగా నిలిచారన్నారు. ఆర్టీసీ కార్మికులు ఫిట్మెంట్ సాధించడంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కీలకపాత్ర పోషించిందన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్ నాయకత్వంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, సంయుక్త కార్యదర్శులు నదీంఅహమ్మద్, మీసాల రంగన్న, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, నగర అధ్యక్షుడు బలరాం, ఆటో యూనియన్ అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, విద్యుత్ ఉద్యోగుల సంఘం బషీర్, వైద్య, ఆరోగ్య ఉద్యోగుల సంఘం శ్రీధర్, లారీ అ సోసియేషన్ రంగనాయకులు, రైతు, బీసీ, ఎస్సీ, కిసాన్, క్రిష్టియన్ మైనార్టీ విభాగాల అధ్యక్షులు వెంకటచౌదరి, పామిడి వీరాంజనేయులు, పెన్నోబులేసు, మిద్దె భాస్కర్రె డ్డి, జయపాల్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, జిల్లా ప్రధానకార్యదర్శులు మైనుద్దీన్, వెంకటరామిరెడ్డి, నాయకులు కనేకల్ లింగారెడ్డి, గోపాల్‌మోహన్, రాజారెడ్డి, వాయల శీనా, జేఎం బాషా, యూపీ నాగిరెడ్డి, కసనూరు శీనా, అనిల్‌కుమార్‌గౌడ్, దేవి, సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'జన్మభూమిలో నాయకులను నిలదీయండి'
-
'జన్మభూమిలో నాయకులను నిలదీయండి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకుని ప్రజల ముందుకు రావాలని సూచించారు. హామీలను తక్షణమే నెరవేర్చాలని జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు టీడీపీ నాయకులను నిలదీయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శంకర్ నారాయణ మాట్లాడుతూ..హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని జన్మభూమి కార్యక్రమం చేపడుతున్నారని చంద్రబాబుని సూటిగా ప్రశ్నించారు. -
రాహుల్ కోసమే రాష్ర్టం ముక్కలు
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: రాహుల్‌గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బలీయమైన ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోనియాగాంధీ బర్తడేని సోమవారం నిరసన దినంగా పాటించారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. నగరంలోని సుభాష్ రోడ్డు వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి రఘువీరా కాంప్లెక్ మీదుగా క్లాక్‌టవర్ తిరిగి సప్తగిరి సర్కిల్ చేరుకుని దిష్టిబొమ్మకు అంత్యక్రియలు జరిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓ ఇటలీ దేశస్తురాలు ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని తెలుసుకోకుండా స్వార్థ రాజకీయాల కోసం విభజనకు తెరలేపారని విరుచుకుపడ్డారు. సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి ‘సమైక్య’ ముసుగులో విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీడబ్ల్యూసీ తీర్మానం వచ్చిన వెంటనే సీఎం రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. ఇప్పటి కీ మించి పోయింది లేదని, సీఎంకి దమ్మూ, ధైర్యం ఉంటే విభజన బిల్లు అసెంబ్లీకి రాకముందే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు లేఖ ఆధారంగానే కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజల ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నాయన్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అందరికీ తెల్సిందేనన్నారు. మన రాష్ట్రంలోనూ కాంగ్రెస్, టీడీపీలను భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ముఖ్యనేత ఎర్రిస్వామిరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, అనుబంధ సంఘాల అధ్యక్షులు రిలాక్స్ నాగరాజు, బోరంపల్లి ఆంజినేయులు, లింగాల రమేష్, మిద్దె భాస్కర్‌రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షెక్షావలి, యువజన విభాగం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండిపరుశురాం, విద్యార్థి విభాగం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండిపరుశురాం, నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్ రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, ఉపాధ్యక్షురాలు ప్రమీళమ్మ, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, పార్టీ నగరాధ్యక్షురాలు శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.