కార్పొరేషన్ ను భ్రష్టు పట్టించారు
Published Sat, Mar 4 2017 3:00 PM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
అనంతపురం : ‘నగర ప్రజలకు తాగునీరందించలేని నిస్సహాయ స్థితిలో పాలకవర్గం ఉంది. శుద్ధిజలం సరఫరా కాక జనం రోగాలతో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో కలసి ముద్దలాపురం ఫిల్ట్రేషన్ పాయింట్‌ను సందర్శించాం. అంతేకానీ ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. కమీషన్ల కోసం కక్కుర్తి పడుతుందెవరో..ప్రజలను అడిగితే చెబుతారు..కమీషన్ల కోసం కార్పొరేషన్ ను భ్రష్టు పట్టించిందివీురు కాదా..?’ అని మేయర్ స్వరూపపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.
సమావేశాలకు అధికారులతో బిరియానీలు తెప్పించుకునే స్థాయికి దిగజారారన్నారు. కార్పొరేషన్ లో ఎన్నడూ లేని విధంగా అవినీతి రాజ్యమేలుతోందని, ఆ విషయాన్ని అధికారులే విలేకరుల సమావేశం పెట్టి చెబుతున్నారన్నారు. చీపురు కట్ట నుంచి పింఛన్ల పంపిణీ వరకు ప్రతిదాంట్లోనూ అక్రమాలు చేస్తోందెవరో అందరికీ తెలుసన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నాణ్యమైన పైపులు వేయలేదని అందుకే నీరు కలుషితంగా వస్తోందని మేయర్‌కు...ఇప్పుడు అదే కంపెనీ ఏపీఎండీపీ పైప్‌లైన్ చేపడుతోందన్న విషయం తెలియదా..? అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ముద్దలాపురం ఫిల్ట్రేషన్ పాయింట్‌కు వివిధ మీడియా ప్రతినిధులను తీసుకెళ్లి కళ్లారా నిజాలను చూపించారన్నారు. కొన్ని పరికరాలు పని చేయడం లేదని, నీటి శుద్ధి పూర్తి స్థాయిలో జరగడం లేదని అక్కడి సిబ్బందే చెబుతున్నా..మేయర్‌కు అర్థం కావడం లేదన్నారు. కేవలం స్వార్థ రాజకీయాలతో ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేయడం మానుకోవాలని మేయర్‌కు హితవు పలికారు. బీఎన్ఆర్ కుటుంబం సేవలను గుర్తించే ప్రజలు వారికి అండగా నిలిచారన్నారు.
ఇప్పటికైనా నీచమైన రాజకీయాలు వీడి ప్రజలకు స్వచ్ఛమైన నీరందించాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బాలాంజినేయులు, గూడూరు మల్లికార్జున, షుకూర్, జానకి, బోయ గిరిజమ్మ, బోయ సరోజమ్మ, బోయ పక్కీరమ్మ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement