– బాధిత కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి
అనంతపురం సెంట్రల్ : అదనపు కట్నం దాహానికి బలైన జాస్నవిరెడ్డి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని కోవూరునగర్‌లో ఉన్న జాస్నవిరెడ్డి తల్లిదండ్రులు సూర్యప్రతాప్‌రెడ్డి, రేవతి నివాసానికి వెళ్లి వారిని ఓదార్చారు. ఘటనకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వారు బోరున విలపించారు. న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. నెల కాదు.. రెండునెలలు కాదు ఏడాది పాటు కేసును నాన్చుతూ స్టేషన్‌ల చుట్టూ తిప్పించుకున్నారని తెలిపారు.
దీంతో ఇక న్యాయం జరగదని తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. అడిగినంత కట్నం ఇచ్చినా వారికి ధనదాహం తీరలేదని, తమ కుమార్తెను నిత్యం వేధించేవారని చెప్పారు. పెద్దమనుషులుగా వ్యవహరించిన చెన్నారెడ్డి, చార్లెస్ చిరంజీవిరెడ్డి తమ బిడ్డ ఆత్మహత్యకు ముఖ్య కారకులని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. తన ఆత్మహత్యకు ఎవరెవరు కారకులో అన్ని వివరాలనూ మరణవాంగ్మూలంలో తన కుమార్తె వెల్లడించిందన్నారు. ఆ సూసైడ్ నోట్స్‌ను మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఽచదివి చలించిపోయారు. నిందితులను కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరారు. ఈ విషయంపై త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యనేతలతో కలిసి ఎస్పీని కలుస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
జాస్నవిరెడ్డి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి
Published Fri, Jan 20 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM
Advertisement