jasnavi murder case
-
కదంతొక్కిన మహిళా లోకం
– జాస్నవిరెడ్డి హత్యకేసు నిందితులను శిక్షించాలని డిమాండ్ – ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా అనంతపురం సెంట్రల్ : వరకట్న వేధింపులకు బలైన జాస్నవిరెడ్డి ఆత్మహత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు కదంతొక్కారు. జాస్నవిరెడ్డి తల్లిదండ్రులు రేవతి, సూర్యప్రతాప్‌రెడ్డితో కలిసి ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం, ఆల్ ఇండియా డెమెక్రాటిక్ యూత్ ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నగరంలో టవర్‌క్లాక్ నుంచి ఎస్పీ క్యాంపు కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లలిత మాట్లాడుతూ వరకట్న వేధిపులకు జాస్నవిరెడ్డి బలై పదిరోజులు గడిచినప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. నిందితులు సమాజంలో పెద్ద మనషులుగా చెలామణీ అవుతూ నేరం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం ఎస్పీని కలిసేందుకు అమ్మాయి తల్లిదండ్రులకు మాత్రమే అనుమతి ఇవ్వడంపై మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐడీవైఓ జిల్లా కార్యదర్శి తబ్రేజ్‌ఖాన్, ఏఐడీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, పలు కళాశాలల విద్యార్థినులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
జాస్నవిరెడ్డి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి
– బాధిత కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అనంతపురం సెంట్రల్ : అదనపు కట్నం దాహానికి బలైన జాస్నవిరెడ్డి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని కోవూరునగర్‌లో ఉన్న జాస్నవిరెడ్డి తల్లిదండ్రులు సూర్యప్రతాప్‌రెడ్డి, రేవతి నివాసానికి వెళ్లి వారిని ఓదార్చారు. ఘటనకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వారు బోరున విలపించారు. న్యాయం చేయాలని పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. నెల కాదు.. రెండునెలలు కాదు ఏడాది పాటు కేసును నాన్చుతూ స్టేషన్ల చుట్టూ తిప్పించుకున్నారని తెలిపారు. దీంతో ఇక న్యాయం జరగదని తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. అడిగినంత కట్నం ఇచ్చినా వారికి ధనదాహం తీరలేదని, తమ కుమార్తెను నిత్యం వేధించేవారని చెప్పారు. పెద్దమనుషులుగా వ్యవహరించిన చెన్నారెడ్డి, చార్లెస్ చిరంజీవిరెడ్డి తమ బిడ్డ ఆత్మహత్యకు ముఖ్య కారకులని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. తన ఆత్మహత్యకు ఎవరెవరు కారకులో అన్ని వివరాలనూ మరణవాంగ్మూలంలో తన కుమార్తె వెల్లడించిందన్నారు. ఆ సూసైడ్ నోట్స్‌ను మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఽచదివి చలించిపోయారు. నిందితులను కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరారు. ఈ విషయంపై త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యనేతలతో కలిసి ఎస్పీని కలుస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.