సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరికపై అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్పందించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రభాకర్ చౌదరి మీడియా చిట్ చాట్‌లో పాల్గొన్నారు. 'అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే గుర్నాథ్ రెడ్డి టీడీపీలోకి వస్తున్నారు. ఆయనది అవకాశవాద రాజకీయం. కబ్జాలు.. హత్యలే ఆయన చరిత్ర. ఆయన మా ప్రత్యర్థి.. ఇపుడు మేము ఎవరితో పోరాడాలి. గతంలో కొంత మంది టీడీపీ నేతలపై చెప్పులు వేయించాడు.
జేసీ తప్ప ఆయన చేరికను ఎవరు స్వాగతించడం లేదు. చంద్రబాబు పక్కన నిలబడటానికి కూడా గుర్నాథ్ రెడ్డి సరిపోడు. ఆయన చేరిక కార్యక్రమంలో కూడా నేను హాజరు కాను.. పక్కన నిలబడి ఫొటో దిగేందుకు కూడా నేను ఇష్టపడను. ఇన్ని సంవత్సరాలుగా అసెంబ్లీకి వస్తున్నా.. ఒక గంట కూడా సమావేశాలను మిస్ కాలేదు. కానీ నిన్న(బుధవారం) అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే వెళ్లిపోయాను. నిఖార్సుగా ఉంటే లాభం లేదని అర్థమవుతోంది' అని ప్రభాకర్ చౌదరి మీడియాతో తెలిపారు.
చంద్రబాబుతో అత్యవసర భేటీ
గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరిక నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి బుధవారం చంద్రబాబు నాయుడుతో అత్యవసరంగా భేటీ అయ్యారు. అవకాశవాది అయిన ఆయన వస్తే పార్టీలో జరగబోయే పరిణామాలపై ప్రభాకర చౌదరి అధినేతకు వివరించినట్టు సమాచారం. అయితే పార్టీ బలోపేతం చేయాలనే గుర్నాథ్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు. 2019 వరకు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగానే ఆలోచన చేయాలని ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment