బంద్ విజయవంతం చేయండి
అనంతపురం : ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రుల ప్రకటనలు, ముఖ్యమంత్రి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈనెల 10న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్రబంద్‌ను జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి విజయవంతం చేయాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయి రెండున్నరేళ్లవుతున్నా నేటికీ చంద్రబాబు ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
నిన్నటి రోజున కేంద్ర మంత్రుల ప్రకటనలతో చంద్రబాబు మాటలన్నీ ఉత్తివేనని తేలిపోయిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని నిన్నటి వరకు ఆశలు పెట్టుకున్న కోట్లాది ప్రజల గుండెల్లో గుణపాలు చెక్కేలా కేంద్రం ప్రకటన చేసిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఈరోజు నీటిమూటలు చేశారని ధ్వజమెత్తారు. వెంకయ్యనాయుడు బొంకయ్యనాయుడులా మారారని ఎద్దేవా చేశారు. రాజ్యసభలో పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని చెప్పిన ఆయన ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తేకుండా కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బయట పడేందుకు కేంద్రం వద్ద సాగిలపడ్డారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్‌సీపీ ముందు నుంచీ పోరాడుతోందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంతవరకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పోరాటాలు చేస్తామన్నారు. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.