
సాక్షి, అనంతపురం : జిల్లాలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జేసీ బ్రదర్స్ దౌర్జన్యాలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఎస్పీ కార్యాలయంలోకి చొచ్చుకు పోయేందుకు ప్రయత్రించిన అఖిలపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రిలో శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసులను ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించినా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యమని అఖిల పక్ష నేతలు మండిపడ్డారు. అంతేకాదు సాక్షి విలేకరిపై జేసీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని, జేసి బ్రదర్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అఖిల పక్ష నేతలు ప్రెస్ క్లబ్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేశారు. ఇందులో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయ కర్త పెద్దారెడ్డి, హిందూపురం పార్లమెంట్ వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్యక్షులు శంకర్ నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ పాల్గొన్నారు.