ప్రజా పోరాటాలకు సిద్ధం
- ప్రభుత్వ పెద్దల అవినీతిపై ప్రజలను చైతన్య పరుస్తాం
- కరువుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
- పెనుకొండ వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ
పెనుకొండ (అనంతపురం) : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జనాన్ని చైతన్యపరుస్తూ.. పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. కరువుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కరువు కాటకాలతో ప్రజల జీవితాలు ఛిద్రమవుతున్నాయని అన్నారు. పెనుకొండ పట్టణంలోని వన్షికా గ్రాండ్ ఫంక‌్షన్ హాల్‌లో బుధవారం నిర్వహించిన పెనుకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. సీఎంగా గద్దెనెక్కిన తర్వాత తన హామీలను మాఫీ చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
అనైతిక పాలనతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. పట్టిసీమ, హంద్రీ-నీవా ప్రాజెక్ట్‌లలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు కోసం సేకరించిన భూములకు ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున రైతులకు పరిహారం చెల్లిస్తే.. అదే ఎకరా భూమిని చదును చేయడానికి రూ. 29.75 లక్షలు కేటాయించారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. బెల్, నాసన్ పరిశ్రమల ఏర్పాటు శిలాఫలకాలకే పరిమితమయ్యాయన్నారు. ఎమ్మెల్యే బీకే పార్థ«సారథి, ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇసుకను అక్రమంగా కర్ణాటకలోని బెంగళూరు, తుమకూరుకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ అక్రమాన్ని ప్రశ్నించిన వారిపై దాడులకు ఉసిగొల్పుతున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు దోపిడీ పాలనకు ముగింపు పలికేలా ప్రజలను చైతన్యపరుస్తూ, వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... మరో 365 రోజులు గడిస్తే ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని, ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇటీవల జిల్లాలో జరిగిన టీడీపీ మహానాడులో జిల్లా కరువు గురించి గానీ, రైతు ఆత్మహత్యలు, కష్టాల గురించి గానీ చర్చించిన పాపాన పోలేదన్నారు. విశాఖలో జరిగిన మహానాడులోనూ ప్రజాసమస్యలపై చర్చించడంలో సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, ఇతర నాయకులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. టీడీపీ మూడేళ్ల పాలన మొత్తం అవినీతిమయమన్నారు. వైఎస్ పాలనలో వలసలు, రైతు ఆత్మహత్యలకు అవకాశం ఉండేది కాదన్నారు. వేరుశనగ చెట్లకు కాయలు కాయకపోయినా డబ్బులు కాయిస్తామంటూ రైతన్నలకు భరోసా ఇచ్చిన మహా మనిషి వైఎస్సార్ అని కొనియాడారు. ప్రస్తుతం కరువు నివారణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా టీడీపీ అడ్డుకుందన్నారు. దీనివల్ల నిరుద్యోగ సమస్య పెరిగి, యువతతో పాటు భావితరాలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. టీడీపీ అవినీతిని కాలరాయాలంటే జగన్‌ను సీఎం చేయాలన్నారు. పార్టీ పరిశీలకులు నర్సేగౌడ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితమై జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పెనుకొండ మండల కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, సోమందేపల్లి కన్వీనర్ వెంకటరత్నం, గోరంట్ల కన్వీనర్ ఫకృద్దీన్, రొద్దం కన్వీనర్ నారాయణరెడ్డి, పరిగి కన్వీనర్ జయరాం, టౌన్ కన్వీనర్ ఏనుగుల ఇలియాజ్, సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, సరస్వతమ్మచంద్రారెడ్డి, రాజగోపాలరెడ్డి, లక్ష్మానాయక్, పద్మావతమ్మ, ఎంపీటీసీ సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, ఉమర్ ఫరూక్, మురళి, రహంతుల్లా, బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, లీగల్‌సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, సెంట్రల్‌బ్యాంక్ డైరెక్టర్ శంకరరెడ్డి, జిల్లా నాయకులు గంపల వెంకటరమణారెడ్డి, బూదిలి వేణుగోపాలరెడ్డి, ఎస్‌బీశీనా, నియోజకవర్గంలోని సింగిల్ విండో అధ్యక్షులు, పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.