హామీలను హరించిన 420 చంద్రబాబు
– హంద్రీనీవా దివగంత నేత వైఎస్సార్ పుణ్యమే
– విలేకరులతో జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ
రొద్దం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను హరించిన 420 చంద్రబాబునాయుడు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన రొద్దం మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకుడు ఆర్‌ఏ రవిశేఖరరెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. హంద్రీనీవాకు తానే శంకుస్థాపన చేశానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో 2004 వరకు హంద్రీనీవా పునాది రాళ్లకే పరిమితమైన సంగతి ప్రజలకు తెలుసని చెప్పారు.
దివగంత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీనీవా పథకానికి శంకుస్థాపన చేసి రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్ చొరవతోనే జీడిపల్లి, గొల్లపల్లి ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. ఇప్పుడు కృష్ణాజలాలు అనంతకు వస్తుంటే వాటిని తానే తెచ్చానంటూ చంద్రబాబు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాజుల కాలంలో కట్టించిన చెరువులు వర్షం నీటితో నిండుతుంటే వర్షాలను తానే కురిపించానని సీఎం, మంత్రులు పక్కా ప్రణాళికతో జలహారతి పేరుతో ప్రజా సమస్యలను తప్పదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మారుతిరెడ్డి, జిల్లా అధికారి ప్రతినిధి చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు వజీర్‌బాషా, లక్ష్మీనారాయణరెడ్డి, కాటిమ తిమ్మారెడ్డి, సీనియర్ నాయకుడు రంగయ్య, మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.