
ఆక్రమణదారులపై ‘ధిక్కార’ చర్యలు
106 షాపుల యజమానులకు కోర్టు ధిక్కార నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సిద్దిఅంబర్‌బ జార్‌లో ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించబోమంటూ హామీ ఇచ్చి, దానిని ఉల్లంఘించిన 106 షాపుల యజమానులపై ఉమ్మడి హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. హామీని ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరించాలంటూ వారందరికీ మంగళవారం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
సిద్దిఅంబర్‌బజార్‌లో ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణలు జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ క్రమంలో సిద్దిఅంబర్‌బజార్‌లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలకు పాల్పడుతున్న 106 షాపులను ధర్మాసనం ఇటీవల జప్తు చేయించింది. దీంతో ఆ షాపుల యజమానులు ఇకపై ఆక్రమణలకు పాల్పడబోమం టూ రాతపూర్వక హామీలివ్వడంతో, జప్తు చేసిన షాపులను తెరవాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ ఆక్రమణలు మళ్లీ మొదలు కావడంతో వారిపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ధర్మాసనం ఉపక్రమించింది.