విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మరిన్ని పాదయాత్రలు, దీక్షలు చేయాలని సీపీఐ నిర్ణయించింది. అందులోభాగంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు, దీక్షలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. మంగళవారం విజయవాడలో రామకృష్ణ మాట్లాడుతూ... వచ్చే నెల 22వ తేదీన రాష్ట్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనున్నారు .... ఈ నేపథ్యంలో హోదా ప్రకటించాలని కోరుతూ సామూహిక రాయబార కార్యక్రమం నిర్వహించనున్నట్లు రామకృష్ణ తెలిపారు.
ప్రధాని మోదీ హోదా ప్రకటించకుంటే జైల్ భరో ద్వారా తమ నిరసన తెలియజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వీటితోపాటు నిత్యావసరాల ధరలు పెరుగుదలపై వచ్చే నెల 5వ తేదీన నిరసనలు చేపట్టనున్నట్లు రామకృష్ణ చెప్పారు.