K Ramakrisha
-
రూ.10 వేల కోట్లతో పేదలకు ఇళ్లను స్వాగతిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 33 లక్షలమంది నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కోసం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చుచేయడాన్ని ఆహ్వానిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. విజయవాడలో ఆదివారం సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్ వర్ధంతి నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్షాల నిర్మాణాత్మక సూచనలను ఆహ్వానిస్తామని సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అమరావతిలో నిర్మించిన 5,600 ఇళ్లను, రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 56 వేల టిడ్కో ఇళ్లను పేదలకు పంచాలని ప్రభుత్వాన్ని కోరారు. సుబాబుల్ రైతుల సమస్యలపై ఈ నెల 10న ఛలో సీఎం క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని రైతు సంఘాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, పార్టీ నాయకులు జి.ఓబులేసు, కె.వి.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టాభి వాడుతున్న పదజాలం సరికాదు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించేందుకు టీడీపీ నాయకుడు పట్టాభి వాడుతున్న పదజాలం సరైంది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇదే సందర్భంలో దాడులు చేయడం కూడా సరైన విధానం కాదన్నారు. కార్యకర్తలను, నాయకులను నియంత్రించాల్సిన బాధ్యత సీఎం జగన్‌కు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఉందన్నారు. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైఎస్సార్సీపీ నేతలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేయడం సహజమని, వాటిని ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొవాలన్నారు. -
పవన్..టికెట్లపై కాదు.. ప్రజా సమస్యలపై స్పందించండి..
రాప్తాడు: సినిమా టికెట్లపై కాకుండా ప్రజా సమస్యలపై పవన్‌కల్యాణ్ స్పందిస్తే బాగుంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హితవు పలికారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణకు 230 రోజులుగా కార్మికులు పోరాటాలు చేస్తున్నా.. అక్కడికి పవన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కాగా, ఈ ఏడాది వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయిందని, నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం వద్ద ఎండిన వేరుశనగ పంట పొలాలను పరిశీలించారు. సీఎం జగన్ తక్షణమే వ్యవసాయ శాఖ మంత్రిని, వ్యవసాయ, రెవెన్యూ అధికారులను పంట పొలాలకు పంపాలని సూచించారు. రైతులకు పరిహారం అందేలా చూడాలని కోరారు. -
వెంకయ్యకు రామకృష్ణ లేఖ
సాక్షి, విజయవాడ : టీడీపీ రాజ్యసభ సభ్యులు ఫిరాయింపులకు పాల్పడిన నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ శుక్రవారం రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడుకి లేఖ రాశారు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ప్రజాస్వామిక విలువలను దిగజార్చారని లేఖలో మండిపడ్డారు. పార్టీ నాయకులతో ఎలాంటి సమావేశం జరపకుండా పార్టీ మారడం.. వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ప్రొద్బలంతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహించి స్పీకర్ పదవికే కళంకం తెచ్చారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతంలో పార్టీ ఫిరాయింపుల గురించి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలను లేఖలో ప్రస్తావించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి గాను.. ఫిరాయించిన తక్షణమే పదవి పోయేలా చట్టం తీసుకురావాలంటూ వెంకయ్య చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజాస్వామ్యవాదులంతా హర్షం వ్యక్తం చేశారన్నారు. అలాంటిది.. ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉండి ఫిరాయింపుదార్లకు తలపులు తెరవడాన్ని జనాలు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. వెంకయ్యకే గనక చిత్తశుద్ధి ఉంటే పార్టీ మారిన టీడీపీ ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేసి పదవుల నుంచి తొలగించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. లేదంటే వెంకయ్య చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. ప్రజాస్వామిక విలువలను కాపాడి.. ఫిరాయింపుల నిరోధానికి కఠిన చట్టం తీసుకురావాలని రామకృష్ణ కోరారు. (చదవండి: టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనం) -
హోదా కోసం 2వ తేదీ నుంచి పాదయాత్రలు, దీక్షలు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మరిన్ని పాదయాత్రలు, దీక్షలు చేయాలని సీపీఐ నిర్ణయించింది. అందులోభాగంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు, దీక్షలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. మంగళవారం విజయవాడలో రామకృష్ణ మాట్లాడుతూ... వచ్చే నెల 22వ తేదీన రాష్ట్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనున్నారు .... ఈ నేపథ్యంలో హోదా ప్రకటించాలని కోరుతూ సామూహిక రాయబార కార్యక్రమం నిర్వహించనున్నట్లు రామకృష్ణ తెలిపారు. ప్రధాని మోదీ హోదా ప్రకటించకుంటే జైల్ భరో ద్వారా తమ నిరసన తెలియజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వీటితోపాటు నిత్యావసరాల ధరలు పెరుగుదలపై వచ్చే నెల 5వ తేదీన నిరసనలు చేపట్టనున్నట్లు రామకృష్ణ చెప్పారు.