సాక్షి, విజయవాడ : టీడీపీ రాజ్యసభ సభ్యులు ఫిరాయింపులకు పాల్పడిన నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ శుక్రవారం రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడుకి లేఖ రాశారు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ప్రజాస్వామిక విలువలను దిగజార్చారని లేఖలో మండిపడ్డారు. పార్టీ నాయకులతో ఎలాంటి సమావేశం జరపకుండా పార్టీ మారడం.. వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ప్రొద్బలంతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహించి స్పీకర్ పదవికే కళంకం తెచ్చారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గతంలో పార్టీ ఫిరాయింపుల గురించి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలను లేఖలో ప్రస్తావించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి గాను.. ఫిరాయించిన తక్షణమే పదవి పోయేలా చట్టం తీసుకురావాలంటూ వెంకయ్య చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజాస్వామ్యవాదులంతా హర్షం వ్యక్తం చేశారన్నారు. అలాంటిది.. ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉండి ఫిరాయింపుదార్లకు తలపులు తెరవడాన్ని జనాలు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. వెంకయ్యకే గనక చిత్తశుద్ధి ఉంటే పార్టీ మారిన టీడీపీ ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేసి పదవుల నుంచి తొలగించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. లేదంటే వెంకయ్య చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. ప్రజాస్వామిక విలువలను కాపాడి.. ఫిరాయింపుల నిరోధానికి కఠిన చట్టం తీసుకురావాలని రామకృష్ణ కోరారు. (చదవండి: టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనం)
Comments
Please login to add a commentAdd a comment