అనంత’ రైతులు, కూలీలను ఆదుకోవాలంటూ సీపీఐ, రైతు సంఘం నేతలు చలో అసెంబ్లీకీ శ్రీకారం చుట్టారు.
అనంతపురం న్యూసిటీ : ‘అనంత’ రైతులు, కూలీలను ఆదుకోవాలంటూ సీపీఐ, రైతు సంఘం నేతలు చలో అసెంబ్లీకీ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అసెంబ్లీ ఎదుట ధర్నా చేపట్టేందుకు గురువారం వారు అమరావతికి బయలుదేరారు. అనంతపురం నుంచి కేరళకు తరలివెళ్లిన రైతులు, కూలీల దుర్భర జీవితాన్ని ప్రతిభింబించేలా ఫ్లెక్సీలను ప్రదర్శించారు. అనంతపురం రైల్వే స్టేషన్ ఆవరణంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ విలేకరులతో మాట్లాడారు. కేరళ, ఎన్‌టీఆర్ ప్రభుత్వం తరహాలో రైతులకు కరువు పింఛన్లు ఇవ్వాలన్నారు.
ప్రతి రైతుకు రూ 20వేలు పరిహారం అందించాలన్నారు. ప్రతి మండలంలో ఉచిత గడ్డి కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనులు కల్పించి వలసలను అరికట్టాలన్నారు. ప్రభుత్వ మెడలు వంచైనా రైతులను ఆదుకునేలా పోరాటం చేస్తామన్నారు. విజయవాడకు బయలుదేరిన వారిలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సీ జాఫర్, పీ నారాయణస్వామి, కార్యదర్శివర్గ సభ్యులు సంజీవప్ప, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఏ కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సభ్యులు ఎండీ సంజీవప్ప, తదితరులు పాల్గొన్నారు.