
దీక్షలో బీవీ రాఘవులు, ఉభయ కమ్యూనిస్టు నేతలు
– వెనుకబడిన ప్రాంతాల ప్రజల్లో మళ్లీ ఆందోళన
– సీమకు ప్రత్యేక ప్యాకేజీ రూ. 50 వేల కోట్లు ఇవ్వాలి –బీవీ రాఘవులు
– ఉభయ కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహారదీక్ష
తిరుపతి తుడా:
అమరావతి కేంద్రంగా ఒకే చోట అభివృద్ధి చేయాలనుకోవడం భవిష్యత్‌లో ఇబ్బంది కరమేనని సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యులు బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ రూ.50 వేల కోట్లు ఇవ్వాలని సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో గురువారం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఒక రోజు నిరాహారదీక్షను చేపట్టారు. ఈ దీక్షను ప్రారంభించిన బీవీ రాఘవులు మాట్లాడుతూ గత పాలకులు హైదరాబాద్‌లో అభివృద్ధిని కేంద్రీకృతం చేయడం వల్లా సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందారన్నారు. వారి ఆందోళనకు తగ్గట్టే అభివృద్ధి చెందిన హైదరాబాద్ కోల్పోయామన్నారు. ఇప్పుడూ అమరావతి కేంద్రంగా అభివృద్ధిని కేంద్రీకరణ చేస్తుండటంతో వెనుకబడిన ప్రాంతాల ప్రజలు ఆందోళనలో పడ్డారన్నారు. రాష్ట్ర విభజనతో మరింతగా నష్టపోయింన సీమ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. విభజ చట్టంలో సీమ, ఉత్తర కోస్తాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పొందుపరిచినా ఇవ్వకుండా దాటవుత దోరణితో వ్యవహరించడం అన్యాయమన్నారు. వెంకయ్య, చంద్రబాబు సీమకు ద్రోహం చేసేలా వ్యవహరించడం బాధాకరన్నారు. ప్యాకేజీ కోసం కేంద్రాన్ని అడుగుతున్నామని చెప్పి ఒక్కసారిగా ప్యాకేజీ వల్లా ఉపయోగం లేదని చెప్పడం వెంకయ్య, బాబుల దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీని తీసుకురావాల్సిన నేతలు దద్దమ్మలుగా మారిపోయారన్నారు. సీమ ప్రజలకు ఈనేతలిద్దరు తీవ్ర ద్రోహానికి ఒడిగట్టారని మండిపడ్డారు. విభజన చట్టంలోని రూ. 50 వేల కోట్లు ఇచ్చేవరకు ఉద్యమం ఆగదన్నారు. సీమ అభివృద్ధి టీడీపీ నేతలు అవసరంలేనట్టుగా ఉందన్నారు. హక్కుల కోసం అన్ని పార్టీలు కలిసిరావాలన్నారు. రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబే పెద్ద అడ్డంకిగా మారాడని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. దీక్షకు మద్దతు ఇచ్చిన భూమన మాట్లాడుతూ సీమ ఈస్థాయిలో వెనుకబాటుకు చంద్రబాబే కారణమన్నారు. ముఖ్యమంత్రిగా గత 9 ఏళ్లు, ఈ రెండున్నరేళ్ల కాలమే నిదర్శనమన్నారు. సీమకు వస్తున్న ప్యాకేజీలు సైతం ఇతర ప్రాంతాలకు మళ్లించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాధరెడ్డి, రాష్ట్ర సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు కుమార్‌రెడ్డి, డి.రామానాయుడు, ఏఐటీయూసీ నాయకులు కందారపు మురళి, ఆపార్టీల నగర అధ్యక్షులు చిన్నం పెంచులయ్య, సుబ్రమణ్యం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.