కదిరి (అనంతపురం) : 'ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పోరాడే సత్తా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదు. ఆయన ఎందుకో భయపడుతున్నారు. ఆ భయం కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. ప్యాకేజీనే బాగుందంటున్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే హోదా పొందిన రాష్ట్రాలు అభివృద్ధి చెందాయన్న విషయం టీడీపీ, బీజేపీ నాయకులు గ్రహించాలి. దగాకోరు చంద్రబాబు సర్కారుపై త్వరలోనే ప్రజా బ్యాలెట్‌తో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తాం' అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆయన మంగళవారం అనంతపురం జిల్లా కదిరి ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని వెంకయ్య అడిగితే.. కాదు 15 ఏళ్లు ఇవ్వాల్సిందేనని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు.
ఈ ఇద్దరు నాయుళ్లు కలిసి ఇప్పుడు హోదా అవసరం లేదని, ప్యాకేజీ సరిపోతుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. వెంకయ్యకు ఏమాత్రం సిగ్గు, శరం ఉన్నా తక్షణం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు పూర్తిగా కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందన్నారు. విద్య, వైద్యం వారి చేతికే అప్పగించారని విమర్శించారు. అభివృద్ధి మొత్తం అమరావతిలో కేంద్రీకృతం చేస్తున్నారన్నారు. రాజధానిని ఫ్రీజోన్‌గా పరిగణించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటకు రెయిన్ గన్‌ల ద్వారా ప్రాణం పోశానని ముఖ్యమంత్రి చెబుతున్న మాటల్లో ఏమాత్రమూ నిజం లేదన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
'మోదీతో పోరాడే సత్తా బాబుకు లేదు'
Published Tue, Sep 13 2016 6:07 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement