టీడీపీది ప్రజాకంటక పాలన
అనంతపురం అర్బన్ : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ప్రజాకంటక పాలన సాగిస్తోందని సీపీఎం నాయకులు ధ్వజమెత్తారు. ప్రజలపై ఆర్థిక భారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. శనివారం విద్యుత్ చార్జీల పెంపుదలను నిరసిస్తూ సీపీఎం నగర కమిటీ అధ్వర్యంలో స్థానిక టవర్ క్లాక్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్, ఐద్వా జిల్లా కార్యదర్శి వి.సావిత్రి మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై ఆర్థిక భారం మోపుతూ కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా పని చేస్తోందని అన్నారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రజలపై విద్యుత్ భారం మోపిందన్నారు. రాష్ట్ర ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ప్రజలపై భారం వేయడం దారుణమన్నారు. ధరల పెంపుదలతో చిన్న పరిశ్రమలు మూతపడతాయన్నారు. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ క్రమంలో విద్యుత్ చార్జీలు పెంచి మరింత భారం వేయడం తగదన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని, లేని పక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, సీఐటీయూ నగర అధ్యక్షుడు గోపాల్, నాయకులు ప్రకాశ్, ముర్తుజా, ఆంజనేయులు, బాబా, నాగప్ప, రంజిత్, ఓబుళేసు, వలి, రమేశ్, చంద్రిక, తదితరులు పాల్గొన్నారు.