- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సంగారెడ్డి మున్సిపాలిటీ : ప్రజా సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, వాటిని వివరించేందుకు ప్రజల్లోకి వెళ్లాలని తమ పార్టీ నిర్ణయించిందని, అందుకోసం ఈ నెల 17నుంచి మార్చి 17వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహాజన పాదయాత్ర చేపట్టనున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అన్ని జిల్లాల పార్టీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై 32 జిల్లాల్లో 170 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ రౌండ్‌టేబుల్ సమావేశాలకు అన్ని కార్మిక సంఘాలతో పాటు ప్రజా సంఘాలను ఆహ్వానించి వారి అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే పారదర్శకంగా జిల్లాల ఏర్పాటు చేయలేదన్నారు. 42 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్‌ను ఎంఐఎం ఒత్తడి మేరకు అక్కడ కొత్త జిల్లాను ఏర్పాటు చేయలేదన్నారు.
కొత్త జిల్లాల్లో ఇప్పటివరకు ఉన్న సౌకర్యాలను, సదుపాయాలను పెంచాలని తమ్మినేని సూచించారు. గ్యాంగ్‌స్టర్ నయీంతో పోలీసులు, రాజకీయ నాయకులు సంబంధాలు కలిగి ఉన్నారని చెబుతున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కానీ తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లపై మాత్రం పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ముస్లింలకు 14 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేకపోయారన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 17న ఇబ్రహీంపట్నం నుంచి నిర్వహించే మహాజన పాదయాత్రం సామాజిక తెలంగాణ కోసమేనని తెలిపారు. వివిధ కారణాలతో మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని తమ్మినేని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో సంగారెడ్డి జిల్లా సీపీఎం కార్యదర్శి బి.మల్లేశం, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, మెదక్ జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం, రాష్ట్ర కార్యదర్శి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
'ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం'
Published Sat, Oct 15 2016 6:47 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
Advertisement
Advertisement