క్రైమ్ ఫ్రీ జోన్‌గా చిత్తూరు
నేరాల్లో 30శాతం రోడ్డుప్రమాదాలే
సీపీవోల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్
చిత్తూరు (అర్బన్) : చిత్తూరును క్రైమ్ ఫ్రీ జోన్‌గా మార్చడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. శనివారం చిత్తూరు నగరంలోని పోలీసు అతిథిగృహంలో ఏఎస్పీ అభిషేక్ మొహంతితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2016లో 3,970 కేసులు నమోదైతే, 3,099 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. మొత్తం నేరాల్లో 30 శాతాన్ని రోడ్డు ప్రమాదాలు ఆక్రమించడం ఆలోచించాల్సిన విషయమని పేర్కొన్నారు. జిల్లాలో 748 సీసీ కెమెరాలు, 37 హెచ్‌డీ కెమెరాలు ప్రధాన కూడళ్లలో ఉంచామన్నారు.
త్వరలోనే జాతీయ, రాష్ట్ర రహదారులపై కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మూడు కిడ్నాప్ గ్యాంగ్‌లను, విదేశాలకు మహిళల్ని తరలించే ముఠాలను సైతం కటకటాల్లోకి పంపించామన్నారు. డయల్–100కు మంచి స్పందన వస్తోందని, 2016లో 23,872 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థలో రెండో విడతగా ప్రజల్ని భాగస్వామ్యం చేయడానికి త్వరలోనే దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఎవరైనా మృతి చెందితే ఐడీఎఫ్ (ఇమీడియట్ డెత్ రిలీఫ్ ఫండ్)ను రాష్ట్రంలో మొదటిసారిగా చిత్తూరులోనే ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల కోసం ప్రత్యేక క్యాంటీన్లు, స్టోర్లు ప్రారంభించామన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఆరోపణలపై పది మందిని పోలీ సు శాఖ నుంచి సస్పెండ్ చేశామన్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో 107 కేసులు నమోదు చేసి 324 మందిని అరెస్టు చేశామన్నారు. 36,618 కిలోల బరువున్న 1,698 దుంగల్ని, 108 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.16.19 కోట్లు ఉంటుందని చెప్పారు. అలాగే 17 మందిపై రౌడీషీట్లు, 26 మందిపై అనుమానిత షీట్లు తెరచామన్నారు. డీఎస్పీలు శ్రీకాంత్, సూర్యనారాయణ, సీఐ వెంకటప్ప, ఎస్‌ఐ ఉమామహేశ్వర్ పాల్గొన్నారు.