నేర రహిత రాజమహేంద్రవరానికి కృషి
అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి
లాకింగ్ హౌస్‌కు సీసీ కెమెరాలు ఏర్పాటు
కమ్యూనిటీ పోలీసింగ్ ఆఫీసర్ల నియమకం
రాజమహేంద్రవరం క్రైం : నేర రహిత నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో అర్బన్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో క్రైమ్ రివ్యూ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నగరంలో హౌస్ బ్రేకింగ్ చోరీలు పెరుగుతున్న దృషా్ట్య వాటిని అరికట్టేందుకు తీర్థయాత్రలకు, ఊరెళ్లే వారి వివరాలు ముందుగా పోలీసులకు అందజేస్తే వారి ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీని వల్ల ఇల్లు చోరీకి గురైతే నిందితులను అరెస్ట్ చేయడంలో సహకరిస్తాయని పేర్కొన్నారు. నగరంలో నేరాలు అరికట్టేందుకు కమ్యునిటీ పోలీసింగ్ ఆఫీసర్లను నియమిస్తున్నట్టు తెలిపారు. దీనికోసం వెయ్యి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తుల ఆధారంగా 18 నుంచి 60 ఏళ్ల వయస్సుగల వారిని ఎంపిక చేసి ఆయా వార్డుల్లో నియమించి నేరాలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలపై వేధింపులు, చైన్ స్నాచింగ్స్ అరికట్టేందుకు విజుబుల్ పోలీసింగ్ సిస్టమ్‌ను çపటిష్ట పరుస్తామన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పలు సూ చనలు చేస్తున్నామని తెలిపారు. కేడీలు, గేంబ్లింగ్, కోడిపందాలు, సింగిల్ నెంబర్ లాటరీ, హైటెక్ వ్యభిచారం వంటి వాటిపై నిఘా పెట్టి నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పదో తరగతి పరీక్షలు, ఓపెన్ స్కూల్, ఇంటర్ తదితర పరీక్షలు సమయం కావడం వల్ల అంవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని 12 మంది డీఎస్పీలు, 13 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు, ఎస్‌బీ సిబ్బంది, డీసీఆర్‌బీ సిబ్బంది, ఫింగర్ ప్రింట్ సిబ్బంది, కమ్యూనికేషన్ సిబ్బంది, ఐటీ కోర్ టీమ్, ఏఆర్ సిబ్బంది, మినిస్ట్రియల్ సిబ్బంది పాల్గొన్నారు. ఉగాదిని పురస్కరించుకొని ఎస్పీ పోలీస్ క్యాలండర్‌ను ఆవిష్కరించారు.