ఆగ్రహ జ్వాల
ఆగ్రహ జ్వాల
Published Fri, Mar 31 2017 11:06 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM
నరసాపురం రూరల్/భీమవరం అర్బన్ :
భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు, నరసాపురం మండలం కె.బేతపూడి గ్రామాల్లో శుక్రవారం యుద్ధ వాతావరణం నెలకొంది. మొగల్తూరు ఘటనలో ఐదుగురు యువకులు మృత్యువాత పడిన ఘటన నేపథ్యంలో తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ప్రజలు రోడ్డెక్కారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆక్వా పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పెద్దఎత్తున మోహరించిన పోలీసులు పోలీసులు అడ్డుకున్నారు. సుమారు రెండు గంటలపాటు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. సీపీఎం నాయకులు బి.బలరామ్, జేఎన్‌వీ గోపాలన్, కవురు పెద్దిరాజు, ముచ్చర్ల త్రిమూర్తులు, ఐద్వా నాయకురాలు పొగాకు పూర్ణ తదితరుల నేతృత్వంలో ప్రజలు ఆక్వా పార్క్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కె.బేతపూడి పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మొగల్తూరు ఘటనతో అయినా ప్రభుత్వం, అధికారులు బుద్ధి తెచ్చుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్‌డౌన్, పోలీసు జులుం నశించాలి, ఫ్యాక్టరీని తరలించాలి అంటూ నినాదాలు చేశారు. ఓ దశలో పంచాయతీ కార్యాలయ ప్రాంతం నుంచి ఆక్వా పార్క్ వద్దకు వెళ్లేందుకు వందలాది మంది ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రయత్నంలో ఐద్వా నాయకురాలు పొగాకు పూర్ణ కాలికి గాయమైంది. పోలీసులు ఫ్యాక్టరీ యజమానులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న తీరును దుయ్యబడుతూ ప్రజలు శాపనార్థాలు పెట్టారు. పోలీసు ఉన్నతాధికారుల అనుమతితో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పిన అనంతరమే రోడ్డెక్కినప్పటికీ అడ్డుకోవడం ఏమిటంటూ సీపీఎం నాయకులు పెద్దిరాజు, త్రిమూర్తులు తదితరులు డీఎస్పీ స్థాయి అ«ధికారులను, ఎస్సైలను ప్రశ్నించారు. ఇదిలావుంటే కొందరు యువకులు, మహిళలు పంచాయతీ కార్యాలయం వెనుక వైపు ఉన్న వాటర్ ట్యాంకు వద్దకు చేరుకుని ఆక్వా పార్క్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వందలాది మంది పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ’కేవలం 30 టన్నుల సామర్థ్యం గల ఆక్వా ప్లాంట్‌లోనే ఐదుగురు చనిపోతే.. తుందుర్రులో 350 టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఆక్వా పార్క్ నుంచి వెలువడే కాలుష్య భూతం వల్ల ఎంతమంది మరణిస్తారో మేరే గమనించండి. పోలీసులుగా కాకుండా.. సాధారణ ప్రజలుగా ఆలోచించండి’ అంటూ ప్రజలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ’మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే యాజమాన్యాలు.. మేమంతా కలిసి ఎంతిస్తే వారు చనిపోవడానికి సిద్ధమో తెలపాలి’ అంటూ పలువురు ఆవేశంతో ఊగిపోయారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కొత్తపల్లి కాశీవిశ్వనాథం, బెల్లపు సత్యనారాయణ, మామిడిశెట్టి రామాంజనేయులు, బెల్లపు భవానీ, జవ్వాది సత్యవతి, పోతురాజు మంగతాయారు, ముచ్చర్ల కనకమహాలక్ష్మి,సత్యవతి, సముద్రాల సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ రగిలిన ’తుందుర్రు’
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆక్వా ప్లాంట్ నుంచి విష వాయువులు వెలువడి ఐదుగురు కూలీలు మృత్యువాత పడిన ఘటనతో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్ నిర్మిస్తున్న తుందుర్రు, కె.బేతపూడి తదితర గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలనే డిమాండ్‌ంతో తుందుర్రు, కె. బేతపూడి, జొన్నలగరువు గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీని ముట్టడించే ప్రయత్నం చేశారు. వ్యూహం ప్రకారం ముందుగానే భారీగా మోహరించిన పోలీసు బలగాలు ప్రజలను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. సుమారు రెండు గంటలపాటు పోలీసులకు, ఆందోళనకారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్‌డౌన్, పోలీసు జులుం నశించాలి, ఫ్యాక్టరీని తరలించాలి అంటూ ప్రజలు పెద్దపెట్టున నినదించారు. నరసాపురం మండలం కె.బేతపూడి పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న వందలాది మంది జనం ఆక్వా పార్క్ నిర్మాణ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అ క్రమంలో ఐద్వా నాయకురాలు పొగాకు పూర్ణ కాలికి బలమైన గాయమైంది. మహిళలపై మగ పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ప్రజలు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కొందరు పంచాయతీ కార్యాలయం వెనుక నుంచి ఆక్వా పార్క్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు మరోసారి వారిని అడ్డుకున్నారు. కేవలం 30 టన్నుల సామర్థ్యం ఉన్న ఆనంద ఆక్వా ప్లాంట్‌లో ఐదుగురు చనిపోతే ఇక్కడి గ్రామాల్లో నిర్మించ తలపెట్టిన 350 టన్నుల సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీలో రోజూ ఎంతమొత్తంలో విషవాయువులు వెలువడతాయో గుర్తించాలంటూ పోలీసులకు ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ ఫ్యాక్టరీని అడ్డుకునేవరకూ ఆందోళన కొనసాగిస్తామని వారంతా హెచ్చరించారు.
Advertisement
Advertisement