acqua park
-
మాట మార్చారేం.. మంత్రిగారూ!
ఆక్వా పార్క్ విషయంలో మంత్రి పితాని ప్రకటనపై ఆళ్ల నాని ధ్వజం ఏ ఒత్తిళ్లు పనిచేశాయో చెప్పాలని డిమాండ్ సాక్షి ప్రతినిధి, ఏలూరు : తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ వేస్తానని ప్రకటించిన పరిశ్రమలు, కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట మార్చడం ఇటు ప్రజల్లోను, అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. నిపుణుల కమిటీ వేస్తానని ప్రకటించిన మంత్రి పితాని రెండు రోజుల్లోనే మాట మార్చడం వెనుక ఏ ఒత్తిళ్లు పనిచేశాయో చెప్పాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని డిమాండ్ చేశారు. సోమవారం ఆయనొక ప్రకటన చేస్తూ.. ఆక్వా పార్క్ విషయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని వారి మనోగతానికి అనుగుణంగా మంత్రి పితాని వ్యవహరిస్తారనుకున్నామని నాని పేర్కొన్నారు. చివరకు మంత్రి ప్రజల పక్షాన నిలబడకుండా.. యాజమాన్యానికి కొమ్ముకాస్తూ స్పందించడం వెనుక వచ్చిన ఒత్తిళ్లు ఏమిటో చెప్పాలని పట్టుబట్టారు. మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే అధ్యయన కమిటీ వేస్తామని పితాని ప్రకటించడంతో న్యాయం జరుగుతుందన్న భావనతో స్వాగతించామని చెప్పారు. ఆ వెంటనే మంత్రి మాట మార్చడం శోచనీయమన్నారు. ఆక్వా పార్క్‌ను తుందుర్రు నుంచి జనావాసాలు లేని తీర ప్రాంతానికి తరలించాలని మూడేళ్లుగా తుందుర్రు, జొన్నలగరువు, కె.బేతపూడి గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నారన్నారు. వారికి మద్దతుగా నిలబడిన విపక్షాలను తప్పు పట్టడం ఎంతమేరకు సమంజసమని పితానిని ప్రశ్నించారు. ఈ విధానానికి ఇకనైనా స్వస్తి పలికి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు. ఆక్వా పార్క్ యాజమాన్యం నిర్లక్ష్యం, విషవాయువుల కారణంగా ఐదుగురు మృత్యువాత పడితే కనీసం యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే సాహసం కూడా ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోందని నాని నిలదీశారు. మొగల్తూరులో 10 టన్నుల సామర్థ్యంతో నిర్మించిన ప్లాంట్ కాలుష్యకారకంగా మారిందని, అదే యాజమాన్యం భారీస్థాయిలో నిర్మిస్తున్న మెగా అక్వా ఫుడ్ పార్క్‌లో కాలుష్యం రాదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటికే ఇటువంటివి 20 ప్లాంట్లు ఉన్నాయని, తుందుర్రుది 21వ ప్లాంట్ అని మాట్లాడుతున్నారని, ఆ 20 ప్లాంట్లు యనమదుర్రు డ్రెయిన్‌పై ఉన్నాయని, అందువల్ల అది కాలుష్య కాసారంగా మారిపోయిందని వివరించారు. ఇప్పుడు గొంతేరు డ్రెయిన్ కూడా అలా కాకూడదన్నదే తమ అవేదన అన్నారు. కొంతమంది మత్స్యకారులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చే స్తున్నారని, తీరప్రాంతాలకు తరలించినా అక్కడ మత్యకారులకు ఇబ్బంది లేకుండా ఆక్వా పార్క్ ఏర్పాటు చేయాలన్నదే తమ వాదన అని నాని వివరించారు. మొగల్తూరు అక్వా ప్లాంట్‌లో విష వాయువుల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో బాధితుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాడుతుందన్నారు. ఈ ప్రమాదం విద్యుదాఘాతం వల్ల జరిగిందంటూ యాజమాన్యం చేసిన ప్రకటనను ఎంపీ గోకరాజు గంగరాజు వల్లె వేయడం సరికాదని నాని ధ్వజమెత్తారు. -
లంచాలు తీసుకున్నావ్ కాబట్టే కొమ్ముకాస్తున్నావ్
ఆక్వా పార్క్ యాజమాన్యానికి చంద్రబాబు అండగా నిలవడంపై మద్దతు ఇవ్వడంపై రోజా ఫైర్ మహిళా దినోత్సవం రోజున మహిళలను కొట్టిస్తావా అంటూ ధ్వజం 15 మంది ఎమ్మెల్యేల్ని ఇచ్చిన జిల్లాకు ఇదా బహుమతి అంటూ నిలదీత ఆక్వా పార్క్‌ను తుందుర్రు నుంచి సముద్ర తీరానికి తరలించాల్సిందేనని డిమాండ్ నరసాపురం : ’మొగల్తూరు ఆనంద ఆక్వా ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా విషవాయువులు వెదజల్లి ఐదుగురి కూలీల ప్రాణాలు పోయాయి. ఇంతవరకూ ఫ్యాక్టరీ యజమానులను అరెస్ట్ చేయలేదు. తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మించవద్దని 40 గ్రామాల ప్రజలు ఏడాదిన్నరగా మొత్తుకుంటున్నారు. చంద్రబాబూ.. ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నా నీ మనసు కరగడం లేదు. ఆ ఫ్యాక్టరీ యజమానుల నుంచి లంచాలు తీసుకున్నావ్ కాబట్టే వాళ్లకు కొమ్ము కాస్తున్నావ్’ అంటూ వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నరసాపురంలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షా శిబిరానికి శనివారం వచ్చిన రోజా ఆయనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబుకు భారీగా ముడుపులు ముట్టాయి కాబట్టే ఆక్వా పార్క్ యాజమాన్యానికి ఇంతగా కొమ్ముకాస్తున్నారన్నారు. కేవలం 10 టన్నుల సామర్థ్యం ఉన్న మొగల్తూరు ఆక్వా పార్క్‌లో విషవాయువులు వెలువడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దలుపుకుంటే ప్రభుత్వం పని అయిపోతుందా? అని ప్రశ్నించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం, ఫ్యాక్టరీ లైసెన్స్‌లు రద్దు చేయడం, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టం లాంటివి చేయడం ప్రభుత్వం కనీస బాధ్యత అని గుర్తు చేశారు. మహిళలపై దాడులు సిగ్గుచేటు ఆక్వా పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలంటూ పోరాటం చేస్తున్న తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు చుట్టుపక్కల గ్రామాల ప్రజలపై ఏడాదిన్నరగా పోలీసుల సాయంతో ప్రభుత్వం దమనకాండ చేయించడం దారుణమని రోజా విమర్శించారు. ’మహిళా దినోత్సవం రోజున మహిళలను పోలీసులతో కొట్టించారు. అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా?’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీ ఇంట్లో వాళ్లు చనిపోతే ఇలాగే వ్యవహరిస్తారా, మీ ఇంట్లో మహిళలను ఇలాగే కొట్టిస్తారా చంద్రబాబు గారూ అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తుందుర్రు అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తే చర్చ జరగకుండా చేశారని అన్నారు. అప్పటి కార్మిక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అసలు ఇక్కడ కాలుష్య సమస్య గాని, మరే సమస్య గాని లేదని బుకాయించారని అన్నారు. సమస్య లేనప్పుడు వందలాది మంది పోలీసులను కాపలాగా ఎందుకు పెట్టారని, ఇక్కడ ఇంత అరాచకం ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ఐదుగురు ప్రాణాలు గాలిలో కలిసిపోయినా కళ్లు తెరవరా అని ప్రశ్నించారు. తుందుర్రు ఎందుకు రావడం లేదు వానపాముల్లాంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం.. సూట్‌కేసులు సర్దుకోవడంలో ముఖ్యమంత్రికి ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమం విషయంలో లేదని రోజా ధ్వజమెత్తారు. కొన్ని నెలలుగా తుందుర్రు రణరంగంగా మారినా.., మొగల్తూరులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినా ముఖ్యమంత్రి ఇక్కడకు ఎందుకు రాలేదని నిలదీశారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చి వాస్తవాలను ప్రత్యక్షంగా చూస్తే జనం బాధలు అర్థమవుతాయన్నారు. ప్రజల పక్షాన ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన దీక్ష మరుపురానిదన్నారు. తుందుర్రు ఆక్వా పార్క్‌ను తీరప్రాంతానికి తరలించే వరకూ తమ పోరాటం ఆగదన్నారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రికి విలాసాల మీద ఉన్న శ్రద్ధ జనంపై లేదన్నారు. చీటికిమాటికి హెలికాప్టర్లలో జిల్లాకు వచ్చే ముఖ్యమంత్రి తుందుర్రు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలకే ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారన్నారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు గుణ్ణం నాగబాబు, కవురు శ్రీనివాస్, పార్టీ మహిళా విబాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడీ రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బర్రి శంకరం, జిల్లా నేతలు సాయినాథ్ ప్రసాద్, పాలంకి ప్రసాద్, వైకేఎస్, కామన బుజ్జి, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, పోరాట కమిటీ నాయకులు ఆరేటి సత్యవతి, సముద్రాల వెంకటేశ్వరరావు మాట్లాడారు. -
పతాక స్థాయికి పోరాటం
ముదునూరి దీక్షతో వేడేక్కిన ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమం మేధా పాట్కర్ పర్యటనతో జాతీయ స్థాయికి ’తుందుర్రు’ అంశం ఫ్యాక్టరీ యాజమాన్యానికి చంద్రబాబు అమ్ముడుపోయారంటూ రోజా ధ్వజం ప్రజాస్వామ్యం ముసుగులో అరాచక పాలన సాగిస్తున్నారంటూ అంబటి విసుర్లు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన తీరం రాష్ట్ర సర్కారు వెన్నులో వణుకు నరసాపురం : ఏడాదిన్నరగా ఉధృతంగా సాగుతున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించాలంటూ ప్రజలు సాగిస్తున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసుల సాయంతో ప్రభుత్వం దమనకాండకు దిగుతున్న విషయం విదితమే. సర్కారు తీరు, ఆక్వా పార్క్ యాజమాన్యం అనుసరిస్తున్న మొండివైఖరి, నిత్యం ముట్టడిస్తున్న పోలీసు బలగాల నడుమ 40 గ్రామాల ప్రజలు సుమారు ఏడాది కాలంగా కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సాగిస్తున్న అరాచకాలతో వణికిపోతున్నారు. తమ జీవనాన్ని కాపాడుకునేందుకు.. భవిష్యత్ తరాలను కాలుష్యం బారినుంచి రక్షించుకునేందుకు అక్కడి ప్రజలు అన్నిటినీ భరిస్తూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడూ రోడ్డెక్కని మహిళలు లాఠీదెబ్బలు సైతం తిన్నారు. చివరకు జైళ్లకు కూడా వెళ్లారు. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాలకు పొరుగునే ఉన్న మొగల్తూరులోని నల్లంవారి తోటలో గల ఆనంద ఆక్వా ప్లాంట్‌లో విషవాయువులు వెలువడి ఐదుగురు యువకులు మృత్యువాత పడటంతో వణికిపోయారు. తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణం పూర్తయితే ఇంతకంటే తీవ్రమైన దుర్ఘటనలు చోటుచేసుకుంటాయనే ఆందోళన వారిని వెన్నాడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తుందుర్రు ప్రాంత ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్ సీపీ ఉద్యమ తీవ్రతను పెంచింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షతో ఉద్యమం మరింత వేడెక్కింది. నరసాపురం అంబేడ్కర్ సెంటర్లో ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన దీక్ష విజయవంతంగా ముగిసింది. రాజకీయాలకు అతీతంగా జనం, సీపీఎం, ప్రజా సంఘాలు ముదునూరి దీక్షకు మద్దతు తెలిపాయి. నరసాపురం, మొగల్తూరు, భీమవరం, పాలకొల్లు, వీరవాసం మండలాల పరిధిలోని గొంతేరు డ్రెయిన్ పరీవాహక ప్రాంతాల్లో గల దాదాపు 40 గ్రామాల ప్రజలు తరలివచ్చి ముదునూరి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఆక్వా పార్క్ నిర్మాణం పూర్తయితే గొంతేరు డ్రెయిన్ కాలుష్య కాసారం అవుతుందని జనం మరోసారి గగ్గోలు పెట్టారు. పంటలు నాశనమైపోతాయని రైతులు, ఉపాధి కరువవుతుందని మత్స్యకారులు, ఆరోగ్యాలు పాడవుతాయని దీక్షా వేదిక సాక్షిగా ప్రజలు కన్నీటి పర్వంతమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు బాధిత గ్రామాల్లో మిన్నంటాయి. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవకుంటే సత్తా చూపుతామని, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ముదునూరి చేపట్టిన దీక్ష శనివారం సాయంత్రం ముగిసింది. ఈ పోరాటం ఇక్కడితో అంతం కాదని, ఇకపై మరింతగా ఆరంభమవుతుందని దీక్ష అనంతరం ముదునూరి ప్రసాదరాజు ప్రకటించారు. నిప్పులు చెరిగిన రోజా ఆక్వా పార్క్ విషయంలో చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న విధానం, ప్రజలపై సాగిస్తున్న దమనకాండపై వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు లంచాలు తీసుకున్నారు కాబట్టే ఆక్వా పార్క్ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. ’మహిళా దినోత్సవం రోజునే మహిళలను కొట్టిస్తావా చంద్రబాబూ.. 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లాకు నీవిచ్చే బహుమతి ఇదేనా’ అంటూ నిలదీశారు. ఆక్వా పార్క్‌ను తుందుర్రు ప్రాంతం నుంచి జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించాల్సిందేనని డిమాండ్ చేశారు. మొగల్తూరు నల్లంవారి తోటలో ఇదే యాజమాన్యం నిర్వహిస్తున్న 10 టన్నుల సామర్థ్యం గల ఆక్వా ప్లాంట్‌లో విషవాయువులు వెలువడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని.. తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మించి ఇంకెంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంటారని నిలదీశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దలుపుకుంటే ప్రభుత్వం సరిపోతుందా అని ప్రశ్నించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం, ఫ్యాక్టరీ లైసెన్స్‌లు రద్దు చేయడం, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టం ప్రభుత్వ కనీస బాధ్యత అని గుర్తు చేశారు. మేధా పాట్కర్ రాకతో.. వైఎస్సార్ సీపీ పోరాట తీవ్రతతో ఒక్కసారిగా మళ్లీ రగిలిన ఉద్యమం ప్రముఖ పర్యావరణవేత్త, నర్మదా బచావో ఉద్యమ నిర్మాత మేధా పాట్కర్ శనివారం రాత్రి కంసాలి బేతపూడి, తుందుర్రు గ్రామాల్లో పర్యటించారు. ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలతో భేటీ అయ్యారు. తుందుర్రులోని ఆక్వా పార్క్‌ను సందర్శించి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొగల్తూరులో ఆనంద ఆక్వా ప్లాంట్‌లో వెలువడిన విషవాయువుల వల్ల మరణించిన యువకుల కుటుంబాల వారితో మాట్లాటాడు. తుందుర్రు, కంసాలిబేతపూడి తదితర గ్రామాల్లో ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను తెలుసుకున్న ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తుందుర్రులో అరాచకాలు, పర్యావరణ ముప్పునకు రాష్ట్ర ప్రభుత్వమే బీజాలు వేసే ప్రయత్నాలపై జాతీయ స్థాయిలో చర్చ పెడతానని ప్రకటించారు. మొత్తంగా తుందుర్రు ఆక్వా పార్క్ ఉద్యమంలో వేడి మరింత రాజుకుంది. -
ఆగ్రహ జ్వాల
నరసాపురం రూరల్/భీమవరం అర్బన్ : భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు, నరసాపురం మండలం కె.బేతపూడి గ్రామాల్లో శుక్రవారం యుద్ధ వాతావరణం నెలకొంది. మొగల్తూరు ఘటనలో ఐదుగురు యువకులు మృత్యువాత పడిన ఘటన నేపథ్యంలో తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ప్రజలు రోడ్డెక్కారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆక్వా పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పెద్దఎత్తున మోహరించిన పోలీసులు పోలీసులు అడ్డుకున్నారు. సుమారు రెండు గంటలపాటు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. సీపీఎం నాయకులు బి.బలరామ్, జేఎన్వీ గోపాలన్, కవురు పెద్దిరాజు, ముచ్చర్ల త్రిమూర్తులు, ఐద్వా నాయకురాలు పొగాకు పూర్ణ తదితరుల నేతృత్వంలో ప్రజలు ఆక్వా పార్క్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కె.బేతపూడి పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మొగల్తూరు ఘటనతో అయినా ప్రభుత్వం, అధికారులు బుద్ధి తెచ్చుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్‌డౌన్, పోలీసు జులుం నశించాలి, ఫ్యాక్టరీని తరలించాలి అంటూ నినాదాలు చేశారు. ఓ దశలో పంచాయతీ కార్యాలయ ప్రాంతం నుంచి ఆక్వా పార్క్ వద్దకు వెళ్లేందుకు వందలాది మంది ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రయత్నంలో ఐద్వా నాయకురాలు పొగాకు పూర్ణ కాలికి గాయమైంది. పోలీసులు ఫ్యాక్టరీ యజమానులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న తీరును దుయ్యబడుతూ ప్రజలు శాపనార్థాలు పెట్టారు. పోలీసు ఉన్నతాధికారుల అనుమతితో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పిన అనంతరమే రోడ్డెక్కినప్పటికీ అడ్డుకోవడం ఏమిటంటూ సీపీఎం నాయకులు పెద్దిరాజు, త్రిమూర్తులు తదితరులు డీఎస్పీ స్థాయి అ«ధికారులను, ఎస్సైలను ప్రశ్నించారు. ఇదిలావుంటే కొందరు యువకులు, మహిళలు పంచాయతీ కార్యాలయం వెనుక వైపు ఉన్న వాటర్ ట్యాంకు వద్దకు చేరుకుని ఆక్వా పార్క్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వందలాది మంది పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ’కేవలం 30 టన్నుల సామర్థ్యం గల ఆక్వా ప్లాంట్‌లోనే ఐదుగురు చనిపోతే.. తుందుర్రులో 350 టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఆక్వా పార్క్ నుంచి వెలువడే కాలుష్య భూతం వల్ల ఎంతమంది మరణిస్తారో మేరే గమనించండి. పోలీసులుగా కాకుండా.. సాధారణ ప్రజలుగా ఆలోచించండి’ అంటూ ప్రజలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ’మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే యాజమాన్యాలు.. మేమంతా కలిసి ఎంతిస్తే వారు చనిపోవడానికి సిద్ధమో తెలపాలి’ అంటూ పలువురు ఆవేశంతో ఊగిపోయారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కొత్తపల్లి కాశీవిశ్వనాథం, బెల్లపు సత్యనారాయణ, మామిడిశెట్టి రామాంజనేయులు, బెల్లపు భవానీ, జవ్వాది సత్యవతి, పోతురాజు మంగతాయారు, ముచ్చర్ల కనకమహాలక్ష్మి,సత్యవతి, సముద్రాల సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. మళ్లీ రగిలిన ’తుందుర్రు’ సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆక్వా ప్లాంట్ నుంచి విష వాయువులు వెలువడి ఐదుగురు కూలీలు మృత్యువాత పడిన ఘటనతో గోదావరి మెగా ఆక్వా ఫుడ్పార్ నిర్మిస్తున్న తుందుర్రు, కె.బేతపూడి తదితర గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలనే డిమాండ్ంతో తుందుర్రు, కె. బేతపూడి, జొన్నలగరువు గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీని ముట్టడించే ప్రయత్నం చేశారు. వ్యూహం ప్రకారం ముందుగానే భారీగా మోహరించిన పోలీసు బలగాలు ప్రజలను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. సుమారు రెండు గంటలపాటు పోలీసులకు, ఆందోళనకారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్‌డౌన్, పోలీసు జులుం నశించాలి, ఫ్యాక్టరీని తరలించాలి అంటూ ప్రజలు పెద్దపెట్టున నినదించారు. నరసాపురం మండలం కె.బేతపూడి పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న వందలాది మంది జనం ఆక్వా పార్క్ నిర్మాణ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అ క్రమంలో ఐద్వా నాయకురాలు పొగాకు పూర్ణ కాలికి బలమైన గాయమైంది. మహిళలపై మగ పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ప్రజలు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కొందరు పంచాయతీ కార్యాలయం వెనుక నుంచి ఆక్వా పార్క్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు మరోసారి వారిని అడ్డుకున్నారు. కేవలం 30 టన్నుల సామర్థ్యం ఉన్న ఆనంద ఆక్వా ప్లాంట్‌లో ఐదుగురు చనిపోతే ఇక్కడి గ్రామాల్లో నిర్మించ తలపెట్టిన 350 టన్నుల సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీలో రోజూ ఎంతమొత్తంలో విషవాయువులు వెలువడతాయో గుర్తించాలంటూ పోలీసులకు ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ ఫ్యాక్టరీని అడ్డుకునేవరకూ ఆందోళన కొనసాగిస్తామని వారంతా హెచ్చరించారు. -
ప్రకంపనలతో ప్రకటన
– ఆక్వాపార్క్ ఉద్యమంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి – యనమదుర్రు కాలువ ప్రక్షాళన ప్రకటన – సీఎం చంద్రబాబు ఆదేశం వాస్తవంగా అమలయ్యేనా? – ఇప్పటివరకు యనమదుర్రు ఎందుకు గుర్తు రాలేదని ప్రముఖుల ప్రశ్న భీమవరం టౌన్ : గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు నిర్మాణ వ్యతిరేక ఉద్యమ ప్రకంపనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బలంగా తాకాయి. ఆక్వా పార్కు నిర్మిస్తే దాని నుంచి వెలువడే రసాయనిక వ్యర్థాలతో గొంతేరు కాలువ మరో యనమదుర్రు కాలువ మాదిరిగా మురుగుకూపంగా మారుతుందని ఉద్యమకారులు రెండేళ్లుగా నినదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదివారం యనమదుర్రు కాలువ ప్రక్షాళనకు కామన్ ఎప్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సిఇటిపి)ని ఏర్పాటు చేసి 9 నెలల్లో నీటిని శుద్ధి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అయితే ఇది సాద్యమయ్యే పనేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు ఎంతో స్వచ్ఛగా ఉన్న యనమదుర్రు కాలువ నేడు కాలుష్యకాసాగరంగా మారింది. దశాబ్దాల తరబడి ఫ్యాక్టరీల కాలుష్యంతో యనమదుర్రు కాలువ జలాలు విషపూరితమయ్యాయి. ఈ డ్రెయిన్ వెంబడి నడిచేందుకూ ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కాలువను మళ్లీ పూర్వపుస్థితికి తీసుకురావడం కుదిరే పనేనా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వం నష్టనివారణ చర్యల్లో భాగంగా యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. కాలుష్య కాసాగరం నాలుగు దశాబ్దాల క్రితం డెల్టా ప్రాంతానికి తాగు, సాగునీటిని అందించిన యనమదుర్రు కాలువ నేడు కాలుష్యకాసాగరంగా మారింది. కాలువ జలాలు మురుగుగా మారడంతో యనమదుర్రు కాలువ పేరు కాస్తా డ్రెయిన్‌గా మారిపోయింది. భీమవరం పట్టణం మధ్య నుంచి ప్రవహిస్తున్న ఈ కాలువ వెంబడి ప్రయాణించే ప్రజలు దాని నుంచి వెదజల్లే దుర్గంధం మూడున్నర దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువ జలాలు కాలుష్యంతో పర్యావరణ, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భూగర్భజలాలకు అనేక విష రసాయనక పదార్థాలు చేరుతున్నాయి. ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణ చట్టాలు తెచ్చినా వాటి అమల్లో చిత్తశుద్ధి కానరావడం లేదనడానికి యనమదుర్రు కాలువ ప్రత్యక్ష సాక్షి. ఒకప్పటి చింతలపూడి తాలూకాలో పుట్టి మెట్ట ప్రాంతం నుంచి డెల్టా వైపు ప్రవహిస్తూ ఏలూరు కాలువలో నందమూరు అక్విడెట్ దాటుతూ అక్కడి నుంచి 40 కిలోమీటర్లు పైబడి యనమదుర్రు కాలువ ప్రవహిస్తోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో గోస్తనీ కాలువ, పాత యనమదుర్రు కాలువ భీమవరం పట్టణం దిగువన కలుస్తాయి. ఈ యనమదుర్రు కాలువలో కొన్ని దశాబ్దాలుగా కొన్ని ఫ్యాక్టరీలు, మునిసిపాల్టీలు వదిలే వ్యర్థపదార్థాలు ఈ కాలువలో చేరుతుండడంతో ఇది నిర్జీవంగా మారింది. మత్స్యసంపద కూడా పూర్తిగా కనుమరుగైంది. పరిశ్రమల కాలుష్యమే కారణం యనమదుర్రు కాలువ స్వచ్ఛమైన జలాలు, మత్స్య సంపదతతో ఉండేది. ఇప్పుడు మురుగుకూపంగా మారింది. పరిశ్రమల కాలుష్యం శుద్ధి చేయకుండా నేరుగా కాలువలోకి వదిలిపెడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం. భూగర్భ జలాలు విషతుల్యంగా మారాయి. – ఎండీ ముగ్దం అలీ, లోక్ అదాలత్ సభ్యుడు ఇప్పుడే గుర్తుకొచ్చిందా? అన్ని రోగాలకు జలాల కాలుష్యమే కారణమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరిశ్రమల పేరుతో జలాలను కలుషితం చేసే హక్కు ఎవరిచ్చారు? ఇన్నేళ్లకు యనమదుర్రు కాలువ ప్రక్షాళన ముఖ్యమంత్రికి గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉంది. అధికార యంత్రాంగం ఏ మేరకు కాలువ జలాలను ప్రక్షాళన చేస్తారో చూడాలి. – జీవీ రామాంజనేయులు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆక్వా పార్క్ ఉద్యమమే కారణం సీఎం చంద్రబాబుగారికి యనమదుర్రు కాలువ ఇప్పుడు గుర్తుకు రావడానికి తుందుర్రులో నిర్మించే ఆక్వాపార్క్ ఉద్యమమే కారణం. ఎంత వరకూ అధికారులు ఈ కాలువను ప్రక్షాళన చేస్తారో చూడాలి. తణుకు, వేండ్ర ప్రాంతంలోని కొన్ని పరిశ్రమలు వదిలే రసాయనిక వ్యర్థాలు కాలువలకు శాపంగా మారాయి. – వి.ఉమామహేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభుత్వం మాటలు నీటి మూటలే పరిశ్రమల యాజమాన్యాలు, అధికార యంత్రాంగం, పాలకుల మాటలు నీటి మూటలే. పరిశ్రమలు స్థాపించేటప్పుడు నిబంధనలు పాటిస్తామంటూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నీటి శుద్ధిప్లాంట్లు ఏర్పాటు చేస్తామంటూ కథలు చెబుతారు. ఇందుకు ఉదాహరణ యనమదుర్రు కాలువ. – యు.వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి