మాట మార్చారేం.. మంత్రిగారూ!
మాట మార్చారేం.. మంత్రిగారూ!
Published Mon, Apr 10 2017 10:58 PM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM
ఆక్వా పార్క్ విషయంలో మంత్రి పితాని ప్రకటనపై ఆళ్ల నాని ధ్వజం
ఏ ఒత్తిళ్లు పనిచేశాయో చెప్పాలని డిమాండ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ వేస్తానని ప్రకటించిన పరిశ్రమలు, కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట మార్చడం ఇటు ప్రజల్లోను, అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. నిపుణుల కమిటీ వేస్తానని ప్రకటించిన మంత్రి పితాని రెండు రోజుల్లోనే మాట మార్చడం వెనుక ఏ ఒత్తిళ్లు పనిచేశాయో చెప్పాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని డిమాండ్ చేశారు. సోమవారం ఆయనొక ప్రకటన చేస్తూ.. ఆక్వా పార్క్ విషయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని వారి మనోగతానికి అనుగుణంగా మంత్రి పితాని వ్యవహరిస్తారనుకున్నామని నాని పేర్కొన్నారు. చివరకు మంత్రి ప్రజల పక్షాన నిలబడకుండా.. యాజమాన్యానికి కొమ్ముకాస్తూ స్పందించడం వెనుక వచ్చిన ఒత్తిళ్లు ఏమిటో చెప్పాలని పట్టుబట్టారు. మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే అధ్యయన కమిటీ వేస్తామని పితాని ప్రకటించడంతో న్యాయం జరుగుతుందన్న భావనతో స్వాగతించామని చెప్పారు. ఆ వెంటనే మంత్రి మాట మార్చడం శోచనీయమన్నారు. ఆక్వా పార్క్‌ను తుందుర్రు నుంచి జనావాసాలు లేని తీర ప్రాంతానికి తరలించాలని మూడేళ్లుగా తుందుర్రు, జొన్నలగరువు, కె.బేతపూడి గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నారన్నారు. వారికి మద్దతుగా నిలబడిన విపక్షాలను తప్పు పట్టడం ఎంతమేరకు సమంజసమని పితానిని ప్రశ్నించారు. ఈ విధానానికి ఇకనైనా స్వస్తి పలికి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు. ఆక్వా పార్క్ యాజమాన్యం నిర్లక్ష్యం, విషవాయువుల కారణంగా ఐదుగురు మృత్యువాత పడితే కనీసం యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే సాహసం కూడా ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోందని నాని నిలదీశారు. మొగల్తూరులో 10 టన్నుల సామర్థ్యంతో నిర్మించిన ప్లాంట్ కాలుష్యకారకంగా మారిందని, అదే యాజమాన్యం భారీస్థాయిలో నిర్మిస్తున్న మెగా అక్వా ఫుడ్ పార్క్‌లో కాలుష్యం రాదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటికే ఇటువంటివి 20 ప్లాంట్లు ఉన్నాయని, తుందుర్రుది 21వ ప్లాంట్ అని మాట్లాడుతున్నారని, ఆ 20 ప్లాంట్లు యనమదుర్రు డ్రెయిన్‌పై ఉన్నాయని, అందువల్ల అది కాలుష్య కాసారంగా మారిపోయిందని వివరించారు. ఇప్పుడు గొంతేరు డ్రెయిన్ కూడా అలా కాకూడదన్నదే తమ అవేదన అన్నారు. కొంతమంది మత్స్యకారులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చే స్తున్నారని, తీరప్రాంతాలకు తరలించినా అక్కడ మత్యకారులకు ఇబ్బంది లేకుండా ఆక్వా పార్క్ ఏర్పాటు చేయాలన్నదే తమ వాదన అని నాని వివరించారు. మొగల్తూరు అక్వా ప్లాంట్‌లో విష వాయువుల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో బాధితుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాడుతుందన్నారు. ఈ ప్రమాదం విద్యుదాఘాతం వల్ల జరిగిందంటూ యాజమాన్యం చేసిన ప్రకటనను ఎంపీ గోకరాజు గంగరాజు వల్లె వేయడం సరికాదని నాని ధ్వజమెత్తారు.
Advertisement
Advertisement