ప్రకంపనలతో ప్రకటన
ప్రకంపనలతో ప్రకటన
Published Mon, Oct 17 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
– ఆక్వాపార్క్ ఉద్యమంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి
– యనమదుర్రు కాలువ ప్రక్షాళన ప్రకటన
– సీఎం చంద్రబాబు ఆదేశం వాస్తవంగా అమలయ్యేనా?
– ఇప్పటివరకు యనమదుర్రు ఎందుకు గుర్తు రాలేదని ప్రముఖుల ప్రశ్న
భీమవరం టౌన్ : గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు నిర్మాణ వ్యతిరేక ఉద్యమ ప్రకంపనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బలంగా తాకాయి. ఆక్వా పార్కు నిర్మిస్తే దాని నుంచి వెలువడే రసాయనిక వ్యర్థాలతో గొంతేరు కాలువ మరో యనమదుర్రు కాలువ మాదిరిగా మురుగుకూపంగా మారుతుందని ఉద్యమకారులు రెండేళ్లుగా నినదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదివారం యనమదుర్రు కాలువ ప్రక్షాళనకు కామన్ ఎప్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (సిఇటిపి)ని ఏర్పాటు చేసి 9 నెలల్లో నీటిని శుద్ధి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అయితే ఇది సాద్యమయ్యే పనేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు ఎంతో స్వచ్ఛగా ఉన్న యనమదుర్రు కాలువ నేడు కాలుష్యకాసాగరంగా మారింది. దశాబ్దాల తరబడి ఫ్యాక్టరీల కాలుష్యంతో యనమదుర్రు కాలువ జలాలు విషపూరితమయ్యాయి. ఈ డ్రెయిన్ వెంబడి నడిచేందుకూ ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కాలువను మళ్లీ పూర్వపుస్థితికి తీసుకురావడం కుదిరే పనేనా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వం నష్టనివారణ చర్యల్లో భాగంగా యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.
కాలుష్య కాసాగరం
నాలుగు దశాబ్దాల క్రితం డెల్టా ప్రాంతానికి తాగు, సాగునీటిని అందించిన యనమదుర్రు కాలువ నేడు కాలుష్యకాసాగరంగా మారింది. కాలువ జలాలు మురుగుగా మారడంతో యనమదుర్రు కాలువ పేరు కాస్తా డ్రెయిన్‌గా మారిపోయింది. భీమవరం పట్టణం మధ్య నుంచి ప్రవహిస్తున్న ఈ కాలువ వెంబడి ప్రయాణించే ప్రజలు దాని నుంచి వెదజల్లే దుర్గంధం మూడున్నర దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువ జలాలు కాలుష్యంతో పర్యావరణ, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భూగర్భజలాలకు అనేక విష రసాయనక పదార్థాలు చేరుతున్నాయి. ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణ చట్టాలు తెచ్చినా వాటి అమల్లో చిత్తశుద్ధి కానరావడం లేదనడానికి యనమదుర్రు కాలువ ప్రత్యక్ష సాక్షి. ఒకప్పటి చింతలపూడి తాలూకాలో పుట్టి మెట్ట ప్రాంతం నుంచి డెల్టా వైపు ప్రవహిస్తూ ఏలూరు కాలువలో నందమూరు అక్విడెట్ దాటుతూ అక్కడి నుంచి 40 కిలోమీటర్లు పైబడి యనమదుర్రు కాలువ ప్రవహిస్తోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో గోస్తనీ కాలువ, పాత యనమదుర్రు కాలువ భీమవరం పట్టణం దిగువన కలుస్తాయి. ఈ యనమదుర్రు కాలువలో కొన్ని దశాబ్దాలుగా కొన్ని ఫ్యాక్టరీలు, మునిసిపాల్టీలు వదిలే వ్యర్థపదార్థాలు ఈ కాలువలో చేరుతుండడంతో ఇది నిర్జీవంగా మారింది. మత్స్యసంపద కూడా పూర్తిగా కనుమరుగైంది.
పరిశ్రమల కాలుష్యమే కారణం
యనమదుర్రు కాలువ స్వచ్ఛమైన జలాలు, మత్స్య సంపదతతో ఉండేది. ఇప్పుడు మురుగుకూపంగా మారింది. పరిశ్రమల కాలుష్యం శుద్ధి చేయకుండా నేరుగా కాలువలోకి వదిలిపెడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం. భూగర్భ జలాలు విషతుల్యంగా మారాయి.
– ఎండీ ముగ్దం అలీ, లోక్ అదాలత్ సభ్యుడు
ఇప్పుడే గుర్తుకొచ్చిందా?
అన్ని రోగాలకు జలాల కాలుష్యమే కారణమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరిశ్రమల పేరుతో జలాలను కలుషితం చేసే హక్కు ఎవరిచ్చారు? ఇన్నేళ్లకు యనమదుర్రు కాలువ ప్రక్షాళన ముఖ్యమంత్రికి గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉంది. అధికార యంత్రాంగం ఏ మేరకు కాలువ జలాలను ప్రక్షాళన చేస్తారో చూడాలి.
– జీవీ రామాంజనేయులు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
ఆక్వా పార్క్ ఉద్యమమే కారణం
సీఎం చంద్రబాబుగారికి యనమదుర్రు కాలువ ఇప్పుడు గుర్తుకు రావడానికి తుందుర్రులో నిర్మించే ఆక్వాపార్క్ ఉద్యమమే కారణం. ఎంత వరకూ అధికారులు ఈ కాలువను ప్రక్షాళన చేస్తారో చూడాలి. తణుకు, వేండ్ర ప్రాంతంలోని కొన్ని పరిశ్రమలు వదిలే రసాయనిక వ్యర్థాలు కాలువలకు శాపంగా మారాయి.
– వి.ఉమామహేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ప్రభుత్వం మాటలు నీటి మూటలే
పరిశ్రమల యాజమాన్యాలు, అధికార యంత్రాంగం, పాలకుల మాటలు నీటి మూటలే. పరిశ్రమలు స్థాపించేటప్పుడు నిబంధనలు పాటిస్తామంటూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నీటి శుద్ధిప్లాంట్లు ఏర్పాటు చేస్తామంటూ కథలు చెబుతారు. ఇందుకు ఉదాహరణ యనమదుర్రు కాలువ.
– యు.వెంకటేశ్వరరావు, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి
Advertisement
Advertisement