కర్నూలుపై కక్ష!
కర్నూలుపై కక్ష!
Published Wed, Dec 28 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
– మైనింగ్ వర్సిటీ బిల్లుపై మాత్రం మౌనం
- ప్రజలు ఆదరించలేదనే అక్కసు
- ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న చంద్రబాబు
- సొంత పార్టీలోనే నేతల కినుక
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ కర్నూలు జిల్లాను మరోసారి మోసగిచ్చేందుకు సిద్ధమయింది. గత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా ఇచ్చిన హామీల్లో ప్రభుత్వం ఒక్కొక్కటిగా నీరు గారుస్తోంది. డోన్‌లో మైనింగ్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని ఆ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటి వరకు ఒక్క అడుగూ ముందుకు పడని పరిస్థితి. ఇదే సమయంలో అనంతపురంలో ఇంధన వర్సిటీ, కాకినాడలో లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు మాత్రం ప్రత్యేకంగా బిల్లులు సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా రాబోయే బడ్జెట్ సమావేశాల్లో బిల్లులను ఆమోదించేందుకు కూడా కసరత్తు జరుగుతోంది. ఇందుకు భిన్నంగా ఈ వర్సిటీల ఏర్పాటు కంటే ముందుగానే హామీ ఇచ్చిన మైనింగ్ వర్సిటీపై మాత్రం కనీసం దృష్టి సారించలేదు. తద్వారా కర్నూలు జిల్లాపై మరోసారి రాజకీయ కక్ష సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయిందని అర్థమవుతోంది. కర్నూలు జిల్లాకు ఇచ్చిన హామీల విషయంలో ఆది నుంచి అధికార పార్టీ ఇదే వైఖరిని కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలతో పాటు రాజకీయ పార్టీలన్నీ ఏకమై నిలదీయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రతిపక్షపార్టీకి పట్టం కట్టినందుకే..
కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 11 అసెంబ్లీ సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలువగా, మిగిలిన మూడు స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాపై అధికార పార్టీ కక్షపూరిత వైఖరిని కొనసాగిస్తోంది. ఇక్కడ ఏర్పాటు కావాల్సిన హజ్‌హౌస్‌ను గుంటూరుకు తరలించింది. అంతేకాకుండా కర్నూలు నగరం స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి తీరా కేంద్రానికి పంపిన జాబితాలో చోటు కల్పించకపోవడం గమనార్హం. ఈ విధంగా అన్ని విషయాల్లోనూ కర్నూలు జిల్లాపై అధికారపార్టీ కక్షపూరిత వివక్షను చూపిస్తోంది. ప్రతిపక్షానికి పట్టం కట్టిన జిల్లాను అభివృద్ధి చేయమనే రీతిలో సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అన్ని పార్టీలు ఏకమై డోన్‌లో మైనింగ్ వర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
అధికార పార్టీలోనూ అసమ్మతి
అధికార పార్టీలో కూడా తమ అధినేత వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజాదరణ లేకపోవడం వల్లే సీట్లు రాలేదని.. దీనిని పెంచుకునేందుకు జిల్లాపై మరింతగా దృష్టి కేంద్రీకరించాల్సింది పోయి పట్టించుకోకపోవడం ఏమి రాజనీతిజ్ఞత అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తద్వారా జిల్లాలో పార్టీ మరింత బలహీనపడుతుందని అభిప్రాయపడుతున్నారు. కేవలం ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే ప్రజాదరణ పెరగదని.. జిల్లాను అభివృద్ధి చేస్తేనే ఆకర్షితులవుతారని పేర్కొంటున్నారు. ఈ మాత్రం కనీస ప్రాథమిక రాజకీయ సూత్రం తెలియకుండా తమ అధినేత ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తద్వారా అధికార పార్టీలో ఉన్న నేతలుగా తాము నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
Advertisement
Advertisement