(సాక్షిప్రతినిధి, అనంతపురం) : ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళిక లోపం వెరసి... రైతులకు శాపంగా మారింది. అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా మూడేళ్లుగా ‘అనంత’కు కృష్ణా జలాలను తీసుకొస్తున్నా.. ఒక్క ఎకరాను కూడా తడపలేకపోతున్నారు. ఫలితంగా నీరంతా వృథా అవుతోంది. అందుకోసం ఖర్చు చేస్తున్న డబ్బు కూడా ‘నీటి’పాలవుతోంది. సాగు, తాగునీటి కష్టాలు రాయలసీమ వాసులకు తెలిసినట్లుగా రాష్ట్రంలో మరెవ్వరికీ తెలియవు. కరువు సీమలో ప్రతి నీటిబొట్టూ విలువైనదే. కాబట్టి ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి. అందులోనూ హంద్రీ-నీవా ద్వారా ఎన్నో వ్యయప్రయాలకోర్చి కృష్ణా జలాలను జిల్లాకు తెస్తున్నారు. ఇందుకోసం ఖర్చు పెట్టే ప్రతిపైసా రైతులకు ఉపయోగపడేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే.. గత కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ప్రస్తుత టీడీపీ సర్కారుగానీ ఆ ప్రయత్నం చేయడం లేదు.
కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేలా హంద్రీ-నీవా పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం పనులు మూడేళ్ల కిందటే 80 శాతం మేర పూర్తయ్యాయి. శ్రీశైలం రిజర్వాయర్‌కు నీరు సమృద్ధిగా చేరితే బ్యాక్ వాటర్ నుంచి హంద్రీ-నీవా కాలువలోకి లిఫ్ట్ చేస్తారు. మూడేళ్లుగా మల్యాల నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకూ ఎనిమిది లిఫ్ట్‌ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక టీఎంసీ నీరు ఎత్తిపోసేందుకు తొమ్మిది రోజులు పడుతుంది. ఇందుకు 2012-13లో రూ.8-10 కోట్ల కరెంటు బిల్లు వచ్చేది. ప్రస్తుతం రూ.12 కోట్లు వస్తోంది.
గత ఖరీఫ్, రబీలో(2014-15)లో 16.9 టీఎంసీల నీరు జిల్లాకు వచ్చింది. అంటే ఈ నీటిని జిల్లాకు తీసుకొచ్చేందుకు కేవలం కరెంటు బిల్లుల రూపంలోనే దాదాపు రూ.204 కోట్లు ఖర్చయ్యాయి. నీటిపారుదల శాఖ గణాంకాల ప్రకారం ఒక టీఎంసీ నీటిని పది వేల ఎకరాలకు అందించొచ్చు. అంటే 2014-15లో 1.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వీలుండేది. అదే డ్రిప్‌ను అనుసంధానం చేసివుంటే రెండు లక్షల ఎకరాలకు పైగానే ఆయకట్టు సాగులోకి వచ్చేది. అయితే.. ఒక్క ఎకరాకు కూడా ప్రభుత్వం నీరందించలేకపోయింది. నీటిని పూర్తిగా హెచ్చెల్సీ జలాల్లో కలిపి వినియోగించడం, చెరువులకు నింపామని ప్రకటనలు గుప్పించడం మినహా పూర్తిస్థాయి వినియోగంపై చిత్తశుద్ధి చూపలేదు.
చిత్తశుద్ధి అవసరం..
మల్యాల నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకూ హంద్రీ-నీవా ప్రధాన కాలువ పనులు దాదాపు పూర్తయ్యాయి. అయితే.. ఎక్కడా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ(ఉప, పిల్లకాలువలు)ను ఏర్పాటు చేయలేదు. ఇందుకు రూ.200 కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తే ఆరు నెలల్లో ప్రధాన కాలువతో పాటు రిజర్వాయర్ల నుంచి రైతుల పొలాలకు నీరు చేరేందుకు ఉప, పిల్ల కాలువలను నిర్మించొచ్చు. ఈ ఏడాది 20 టీఎంసీలకు తక్కువ లేకుండా కృష్ణా జలాలు జిల్లాకు చేరే అవకాశముంది.
ఈ నీటిని రెండు లక్షల ఎకరాలకు అందించొచ్చు. ఇదే జరిగితే జిల్లాలో ఇప్పుడున్న ఆయకట్టు కాకుండా కొత్తగా రెండు లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. తద్వారా రైతులు బంగరుపంటలు పండించే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ. 221 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం కరెంటు బిల్లులు రూ.204 కోట్లు, ఉద్యోగుల వేతనాలకు రూ.70 కోట్లు కలిపి.. మొత్తం రూ.274 కోట్లు అవసరం. అంటే కేటాయించిన నిధులు కాకుండా ప్రభుత్వమే రూ.53 కోట్లు బాకీ పడుతుంది.
ఈ క్రమంలో జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డితో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కృష్ణా జలాలవినియోగానికి అనుకూలమైన పరిస్థితులను సీఎం చంద్రబాబుకు వివరించి రూ.200 కోట్లు విడుదల చేసేలా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముంది. అలాచేస్తే ‘అనంత’కు కొంతైనా మేలుచేసిన వారవుతారు. ‘చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న కాలంలో హంద్రీ-నీవాను గాలికొదిలేసి ‘అనంత’కు తీరని అన్యాయం చేశారు. కనీసం ఇప్పుడైనా చిన్నసాయంగా రూ.200 కోట్లు విడుదల చేసి జిల్లాను ఆదుకోవాల’ని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
దయ చూపరూ...
Published Mon, Apr 20 2015 3:08 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 AM
Advertisement
Advertisement