లంచాలు తీసుకున్నావ్ కాబట్టే కొమ్ముకాస్తున్నావ్
లంచాలు తీసుకున్నావ్ కాబట్టే కొమ్ముకాస్తున్నావ్
Published Sat, Apr 8 2017 11:04 PM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM
ఆక్వా పార్క్ యాజమాన్యానికి చంద్రబాబు అండగా నిలవడంపై మద్దతు ఇవ్వడంపై రోజా ఫైర్
మహిళా దినోత్సవం రోజున మహిళలను కొట్టిస్తావా అంటూ ధ్వజం
15 మంది ఎమ్మెల్యేల్ని ఇచ్చిన జిల్లాకు ఇదా బహుమతి అంటూ నిలదీత
ఆక్వా పార్క్‌ను తుందుర్రు నుంచి సముద్ర తీరానికి తరలించాల్సిందేనని డిమాండ్
నరసాపురం :
’మొగల్తూరు ఆనంద ఆక్వా ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా విషవాయువులు వెదజల్లి ఐదుగురి కూలీల ప్రాణాలు పోయాయి. ఇంతవరకూ ఫ్యాక్టరీ యజమానులను అరెస్ట్ చేయలేదు. తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మించవద్దని 40 గ్రామాల ప్రజలు ఏడాదిన్నరగా మొత్తుకుంటున్నారు. చంద్రబాబూ.. ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నా నీ మనసు కరగడం లేదు. ఆ ఫ్యాక్టరీ యజమానుల నుంచి లంచాలు తీసుకున్నావ్ కాబట్టే వాళ్లకు కొమ్ము కాస్తున్నావ్’ అంటూ వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నరసాపురంలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షా శిబిరానికి శనివారం వచ్చిన రోజా ఆయనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబుకు భారీగా ముడుపులు ముట్టాయి కాబట్టే ఆక్వా పార్క్ యాజమాన్యానికి ఇంతగా కొమ్ముకాస్తున్నారన్నారు. కేవలం 10 టన్నుల సామర్థ్యం ఉన్న మొగల్తూరు ఆక్వా పార్క్‌లో విషవాయువులు వెలువడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దలుపుకుంటే ప్రభుత్వం పని అయిపోతుందా? అని ప్రశ్నించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం, ఫ్యాక్టరీ లైసెన్స్‌లు రద్దు చేయడం, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టం లాంటివి చేయడం ప్రభుత్వం కనీస బాధ్యత అని గుర్తు చేశారు.
మహిళలపై దాడులు సిగ్గుచేటు
ఆక్వా పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలంటూ పోరాటం చేస్తున్న తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు చుట్టుపక్కల గ్రామాల ప్రజలపై ఏడాదిన్నరగా పోలీసుల సాయంతో ప్రభుత్వం దమనకాండ చేయించడం దారుణమని రోజా విమర్శించారు. ’మహిళా దినోత్సవం రోజున మహిళలను పోలీసులతో కొట్టించారు. అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా?’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీ ఇంట్లో వాళ్లు చనిపోతే ఇలాగే వ్యవహరిస్తారా, మీ ఇంట్లో మహిళలను ఇలాగే కొట్టిస్తారా చంద్రబాబు గారూ అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తుందుర్రు అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తే చర్చ జరగకుండా చేశారని అన్నారు. అప్పటి కార్మిక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అసలు ఇక్కడ కాలుష్య సమస్య గాని, మరే సమస్య గాని లేదని బుకాయించారని అన్నారు. సమస్య లేనప్పుడు వందలాది మంది పోలీసులను కాపలాగా ఎందుకు పెట్టారని, ఇక్కడ ఇంత అరాచకం ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ఐదుగురు ప్రాణాలు గాలిలో కలిసిపోయినా కళ్లు తెరవరా అని ప్రశ్నించారు.
తుందుర్రు ఎందుకు రావడం లేదు
వానపాముల్లాంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం.. సూట్‌కేసులు సర్దుకోవడంలో ముఖ్యమంత్రికి ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమం విషయంలో లేదని రోజా ధ్వజమెత్తారు. కొన్ని నెలలుగా తుందుర్రు రణరంగంగా మారినా.., మొగల్తూరులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినా ముఖ్యమంత్రి ఇక్కడకు ఎందుకు రాలేదని నిలదీశారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చి వాస్తవాలను ప్రత్యక్షంగా చూస్తే జనం బాధలు అర్థమవుతాయన్నారు. ప్రజల పక్షాన ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన దీక్ష మరుపురానిదన్నారు. తుందుర్రు ఆక్వా పార్క్‌ను తీరప్రాంతానికి తరలించే వరకూ తమ పోరాటం ఆగదన్నారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రికి విలాసాల మీద ఉన్న శ్రద్ధ జనంపై లేదన్నారు. చీటికిమాటికి హెలికాప్టర్లలో జిల్లాకు వచ్చే ముఖ్యమంత్రి తుందుర్రు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలకే ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారన్నారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు గుణ్ణం నాగబాబు, కవురు శ్రీనివాస్, పార్టీ మహిళా విబాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడీ రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బర్రి శంకరం, జిల్లా నేతలు సాయినాథ్ ప్రసాద్, పాలంకి ప్రసాద్, వైకేఎస్, కామన బుజ్జి, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, పోరాట కమిటీ నాయకులు ఆరేటి సత్యవతి, సముద్రాల వెంకటేశ్వరరావు మాట్లాడారు.
Advertisement
Advertisement